కర్నూలులో బంగారం దుకాణాల యజమానులు.. నగర పారక సంస్థ అధికారులు ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా ఉరివేసుకున్నట్టుగా ప్రదర్శన చేస్తూ.. వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కొండారెడ్డి బురుజు వద్దనున్న షరాఫ్ బజార్లో అంగళ్లకు అనుమతులు లేవంటూ నాలుగు రోజుల క్రితం నోటీసులు జారీచేయగా.. వ్యాపారులు ఆందోళనకు దిగారు. నలభై ఏళ్లకు పైగా అక్కడే వ్యాపారాలు చేసుకుంటూ.. మున్సిపాలిటీకి పన్నులు కడుతున్నామని దుకాణదారులు తెలిపారు.
తమతో ఇంతకాలం లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. నోటీసులు ఇచ్చి నాలుగు రోజులు గడవక ముందే.. అంగళ్లు కులగొడతామని బెదిరించడం సరికాదన్నారు. దుకాణాలకు సంబంధించిన అనుమతులు ఉన్నాయని.. కొంత సమయం ఇస్తే పత్రాలను సమర్పిస్తామని స్పష్టం చేశారు.