కడప - కర్నూలు కాలువ (కేసీ కెనాల్) కింద ఆయకట్టుకు చాలినంత నీరు అందక రైతులు గగ్గోలు పెడుతున్నారు. జల వనరులశాఖ కార్యాలయాలకు వెళ్లి ఆందోళన తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మల్యాల నుంచి రెండు పంపుల ద్వారా 674 క్యూసెక్కులు, ముచ్చుమర్రి పథకం నుంచి ఒక పంపు ద్వారా 250 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు - బనకచర్ల ద్వారా వెయ్యి క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అది చాలదని రైతులు అంటున్నారు. కేసీ కాలువ కింద ఖరీఫ్‌లో వేసిన పంటల సాగు ఇంకా పూర్తి కాలేదు.
భారీ వర్షాలవల్ల మొదట్లో వేసిన పంటలో 63వేల ఎకరాల వరకు నష్టపోయారు. అక్కడి రైతులు సెప్టెంబరు నుంచి సాగు చేస్తున్నారు. మిగిలిన దాంట్లోనూ కొంత పంట ఇంకా చేతికి రాలేదు. ఈ ఆయకట్టుకు చివరి దశలో నీటి తడులు చాలినంత అందకముందే కేసీ కాలువ నుంచి నీటి ప్రవాహాలను తగ్గించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరు నాయకులు తాము నీళ్లు ఇప్పిస్తామని చెప్పడంతో అనేకచోట్ల రైతులు రెండో పంట వేశారు.
ఖరీఫ్‌లో ఆలస్యంగా సాగుచేసిన ఆయకట్టుకు, రెండో పంటగా సాగుచేసే ఆయకట్టులో ఇప్పటికే నాట్లు వేసిన 50వేల ఎకరాలకు నీటి అవసరం ఏర్పడింది. ఇదే కాకుండా ఖరీఫ్‌లో తాము పంటలు నష్టపోయినందున శ్రీశైలం నుంచి తమకు నీరు ఇవ్వాలని రైతులు పట్టుబడుతున్నారు. రెండోపంటకు పూర్తిగా నీరందిస్తామన్న భరోసా ఇవ్వలేమని, బోర్లపై ఆధారపడేవారు సొంత బాధ్యతతోనే సాగు చేసుకోవచ్చని జల వనరులశాఖ అధికారులు చెబుతున్నారు.