సోమవారం కార్తికపౌర్ణమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో దీపారాధన చేశారు. కర్నూలు కేసీ కాలువలో కార్తిక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో దీపాలు వెలిగించారు. సంప్రదాయ నృత్యాలు చేశారు. మంత్రాలయంలో పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన కార్తిక మహాదీపోత్సవంలో కంచికామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పాల్గొన్నారు. దీప పూజ, దీపదానం, మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనవని స్వామీజి తెలిపారు. దీపోత్సవంలో 500 మంది మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లావ్యాప్తంగానూ దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాల శివాలయంలో దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఓం, శివలింగం ఆకారాల్లో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. విశాఖ సింహాచలం ఆలయంలో పుణ్యనదీ హారతి నిర్వహించారు. కోనేరులో దీపాలను వదిలారు. వెంకోజీపాలెంలోని గౌరీజ్ఞాన లింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన జ్వాలాతోరణం విశేషంగా ఆకట్టుకుంది. నదీ తీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు.. అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.