ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

jagananna houses: ఇల్లు పూర్తవ్వాలంటే.. అప్పులపాలు కావాల్సిందే(నా?)..! - జగనన్న ఇళ్లు తాజా వార్తలు

జగనన్న కాలనీల్లో ఇళ్లపై సర్కారు మాట మారుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇచ్చే వెసులుబాటు కొందరికే ఉంటోందని ఆందోళన చెందుతున్నారు. నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరిగాయని.. ఒక్కో ఇంటికి రూ.3-4 లక్షల వరకు వ్యయం అవుతుందని వాపోయారు. రాయితీలో సగం కూలీ ఖర్చులకే వెళ్లిపోతున్నాయని లబ్ధిదారులు తెలిపారు.

jagananna house beneficiaries facing problems
జగనన్న ఇళ్ల లబ్ధిదారులు

By

Published : Jul 24, 2021, 7:36 AM IST

పండుగల సమయంలో వివిధ కంపెనీలు... ఆఫర్లు ప్రకటిస్తాయి. భారీగా ప్రచారం చేస్తాయి. ప్రచార ప్రకటనల్లో కింద చిన్న అక్షరాలతో ‘షరతులు వర్తిస్తాయి’ అని రాస్తారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రకటించిన మూడు ఆప్షన్లలోనూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. తొలుత మూడింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చని స్వేచ్ఛ ఇచ్చిన ప్రభుత్వం.. ఆ తర్వాత మాత్రం మీరే కట్టుకోవాలన్న ఆప్షన్‌వైపే మొగ్గు చూపుతోంది. చాలాచోట్ల అధికారులు ఈ దిశగా లబ్ధిదారులపై ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు నిర్మాణ సామగ్రి ధరలు, కూలీ ఖర్చులు భారీగా పెరగడంతో... ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో తాము కట్టుకోవడం అసాధ్యమని, ఇల్లు పూర్తవ్వాలంటే అప్పులపాలు కావడం ఖాయమని లబ్ధిదారులు వాపోతున్నారు.

మొదట్లో 60% లబ్ధిదారులు ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలనే మూడో ఆప్షన్‌కే మొగ్గుచూపారు. ఇంటి నిర్మాణానికి ఇచ్చే రూ.1.80 లక్షలు సరిపోకపోవడం, కరోనాతో ఆర్థిక ఇబ్బందులు, ధరలన్నీ పెరగడంతో నిర్మాణం భారమని భావించి ఎక్కువగా మూడో ఆప్షన్‌నే ఎంచుకున్నారు. ఇది ప్రభుత్వానికి ఆర్థికభారంగా మారే పరిస్థితుల్లో అధికారులు కొత్త షరతులు తెరపైకి తెచ్చారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, దూరప్రాంతాల్లో లేఅవుట్లు కేటాయించిన వారికి, ఇల్లు కట్టుకునే ఆర్థికస్థోమత లేనివాళ్లకే తాము కట్టిస్తామని మెలికపెట్టారు. దీంతో మూడో ఆప్షన్‌ ఎంచుకున్న కొందరు మొదటి ఆప్షన్‌కు బదిలీ అయ్యారు.

జగనన్న ఇళ్లు

స్థలాలు పోతాయని మొదలుపెట్టి...

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం మొదటి విడతగా 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతుండగా ఇప్పటికే 10 లక్షల ఇళ్లను లబ్ధిదారులు ప్రారంభించారు. నిర్మాణం ప్రారంభించకపోతేస్థలాలు రద్దవుతాయని అధికారులు చెప్పడంతో చాలామంది లబ్ధిదారులు అప్పు చేసి హడావుడిగా నిర్మాణపనులు చేపడుతున్నారు. కానీ, పెరిగిన ధరలతో ఇంటి నిర్మాణం పూర్తిచేయడం తమ శక్తికి మించినదవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జగనన్న ఇళ్లు

ధర మేం చెబుతాం.. నిర్ణయం మీ ఇష్టం

ఆప్షన్‌-1లోనూ నిబంధనలు వర్తింపజేస్తున్నారు. మొదట్లో ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షల్లో రూ.1.20 లక్షలు నిర్మాణ సామగ్రి కొనుగోలుకు, మిగతా రూ.60 వేలు కూలి ఖర్చులకు చెల్లించేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇంటి నిర్మాణానికి 22 రకాల సామగ్రి అవసరమని గుర్తించి సేకరణకు రాష్ట్ర, జిల్లాస్థాయుల్లో టెండర్లు పిలిచారు. ఆప్షన్‌-1 ఎంచుకున్న వారికి ఇటుక నుంచి పెయింటు వరకూ అన్నీ ఇస్తామని అధికారులు చెప్పారు. ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా ఆ ధరలకు సరఫరా చేసేందుకు గుత్తేదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. రూ.1.20 లక్షలకు నిర్మాణ సామగ్రి ఇవ్వడం కష్టమైంది.

జగనన్న ఇళ్లు

దీంతో తాజాగా మరో ప్రతిపాదనను అధికారులు సిద్ధం చేశారు. టెండర్లలో ఒక్కో సామగ్రికి వచ్చిన కనిష్ఠ ధర గుర్తించారు. ఒక మొబైల్‌ యాప్‌ను సిద్ధం చేసి సామగ్రి, వాటి ధరలను అందులో ఉంచుతారు. వాలంటీర్ల ఫోన్‌లో యాప్‌ను వేయించి, లబ్ధిదారుల వద్దకు వెళ్లి వాటిని చూపించనున్నారు. వస్తువు, ధర నచ్చి సమ్మతిస్తే లబ్ధిదారులకు వాటిని ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. ఆ ధర మొత్తాన్ని రాయితీ నుంచి మినహాయిస్తుంది. ఇలా కొన్నా... నిర్మాణం పూర్తయ్యేలోపు లబ్ధిదారులకు భారీగానే ఖర్చయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. స్థానికంగానే అంతకంటే తక్కువ ధరకు లభిస్తే లబ్ధిదారులు అక్కడే కొనుక్కోవచ్చు. సిమెంటు, ఇనుము మాత్రం అందరికీ ప్రభుత్వ నిర్దేశిత ధరలకే సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు.

సామగ్రి ఇలా...

నిర్మాణ సామగ్రిలో సిమెంటు, ఇనుము, లైమ్‌, టాయిలెట్‌ డోర్‌, విద్యుత్‌ సామగ్రి, ఒడిశా పాన్‌ మినహా ఇతర సామగ్రి ధరలు ఇప్పటివరకు ఖరారుకాలేదు. సిమెంటు కిటికీలు, తలుపులను అందించేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. వీటికి ప్రత్యామ్నాయం ఆలోచించాలని అధికారులు నిర్ణయించారు. సిమెంటు, ఇనుమును మార్కెట్‌ ధర కంటే తక్కువకే ఇస్తున్నారు. ఆప్షన్లతో సంబంధం లేకుండా లబ్ధిదారులందరికీ వీటిని ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఇంటికి 90 బస్తాల సిమెంటు ఇస్తున్నారు. ఇందుకు రూ.21 వేలు అవుతుంది. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో బస్తాపై మరో రూ.10 ధర ఎక్కువగా ఖరారుచేశారు. కనీసం మరో 30 బస్తాల సిమెంటు కొనాలని, దానికి మరో రూ.11 వేలు అవుతుందని లబ్ధిదారులు చెబుతున్నారు. టన్ను ఇనుము రూ.56,500గా నిర్ధారించి 480 కిలోలు ఇస్తున్నారు. దీనికి రాయితీ నుంచి రూ.27 వేలు మినహాయిస్తారు. విద్యుత్‌సామగ్రి ధర రూ.5,730. ఒడిశా పాన్‌, షట్టర్‌తో కలిపి పీవీసీ టాయిలెట్‌ డోర్‌ ధర రూ.3,500.

కూలీ ఖర్చులకు రూ.లక్షపైనే

కర్నూలులో రోజుకు మేస్త్రీ రూ.800, సహాయకులు రూ.400 చొప్పున తీసుకుంటున్నారు. విజయవాడ గ్రామీణంలోని కంకిపాడు మండలంలో మేస్త్రీకి రూ.600, సహాయకులకు రూ.400 ఉంది. గుంటూరులో ఇద్దరికీ కలిపి రోజుకు రూ.1,100 అవుతోంది. విశాఖపట్నంలోనూ ఇదే పరిస్థితి. ఒక్కో ఇంటికి ఒక మేస్త్రీ, ఐదుగురు సహాయకులు అవసరం. ఎంత సాధారణంగా ఇల్లు కట్టినా రూ.లక్ష వరకు అవుతుందని కార్మికులు చెబుతున్నారు. పట్టణాలు, నగరాల్లో మరో రూ.20-30 వేలు అదనంగా పడనుంది.

ఇసుక రవాణా ఛార్జీ భారమే

ప్రభుత్వం గృహనిర్మాణ లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా ఇస్తున్నా రవాణా ఛార్జీ తడిసి మోపెడవుతోంది. రీచ్‌ నుంచి 40 కి.మీ. కంటే ఎక్కువ దూరం ఉన్న లేఅవుట్‌కు ప్రైవేటుసంస్థతో రూ.3,500 రవాణా ఛార్జీతోనే ఇసుకను సరఫరా చేయిస్తోంది. అంతకంటే తక్కువ దూరం ఉన్న లబ్ధిదారులు వారే సరఫరా చేసుకోవాలని స్పష్టం చేసింది. ట్రాక్టర్‌ ఇసుకను 30-35 కిలోమీటర్లు తీసుకువెళ్లేందుకు రూ.2,500 నుంచి రూ.3 వేలు తీసుకుంటున్నారు. రెండు విడతలుగా 20 టన్నుల ఇసుక ఇవ్వడంతో రూ.10-12 వేలు రవాణా ఛార్జీ అవుతోంది. ప్రభుత్వం ఇస్తున్న ఇసుక కాకుండా... అదనంగా కావల్సినదానికి రూ.5-6 వేలు వెచ్చించాలి.

ఒక్కో ఇంటికి రూ.3-4 లక్షలు వ్యయం

ఎంత సాధారణంగా ఇల్లు కట్టుకున్నా రూ.3-4 లక్షలు ఖర్చవుతుంది. పట్టణాల్లో ఇది మరింత ఎక్కువ. కొన్ని ప్రాంతాల్లో సిమెంటు ఇటుకలు, రాళ్లు దూరం నుంచి తెచ్చుకోవాలి. ఆ రవాణా భారం లబ్ధిదారులపై పడుతోంది. నమూనాలో చెప్పినట్లు వరండా వేయడానికి రేకులు, ఇనుప పైపులు, కూలీ ఖర్చులు కలిపి రూ.25-30 వేల వరకు కానున్నాయి. ఇప్పటికే జగనన్న కాలనీల్లో నమూనాగా కొన్నిచోట్ల లబ్ధిదారులతో అధికారులు కట్టించిన ఇళ్లకు రూ.3 లక్షలకు పైనే ఖర్చయినట్లు లబ్ధిదారులు చెబుతున్నారు.

రూ.40 వేలు అప్పు చేసి బేస్‌మెంట్‌ కట్టించా

నా భర్త మేస్త్రీ. మేమిద్దరం పనిచేసినా బేస్‌మెంట్‌ పూర్తిచేయడానికి రూ.40వేలు అప్పుచేయాల్సి వచ్చింది. ప్రభుత్వం సిమెంటు, ఉచితంగా ఇసుక ఇచ్చినా కూలిఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. నిర్మాణ సామగ్రి ధరలు భారీగా ఉన్నాయి. ఇంటి నిర్మాణం పూర్తయ్యేసరికి మరో రూ.3 లక్షల వరకు ఖర్చవుతుంది. చేతిలో డబ్బులు లేవు. అప్పులూ పుట్టడం లేదు. ప్రభుత్వ రాయితీని మరికొంత పెంచి ఇవ్వాలి. - ఓర్సు లక్ష్మి, మార్కాపురం మండలం, ప్రకాశం జిల్లా

కూలి ఖర్చులకే లక్షన్నర!

నేను, నా భార్య దివ్యాంగులం. మా పింఛను, తహసీల్దారు కార్యాలయం వద్ద అర్జీలు రాయగా వచ్చిన మొత్తంతో కుటుంబాన్ని పోషిస్తున్నా. ప్రభుత్వం స్థలం ఇచ్చి ఇల్లు మంజూరుచేసింది. ఇప్పుడు అధికారులేమో మేమే ఇల్లు కట్టుకోవాలని చెబుతున్నారు. ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షల వరకు అవుతుంది. కూలీ ఖర్చుల కింద లక్షన్నర అడుగుతున్నారు. పూట గడవడమే కష్టం. అప్పులు చేస్తే వడ్డీలు కట్టలేము. ప్రభుత్వమే ఇల్లు కట్టివ్వాలి. - చెన్నప్ప, ఎమ్మిగనూరు మండలం, కర్నూలు జిల్లా

ఇదీ చూడండి.

IAS officers transfers: రాష్ట్రంలో 15 మంది ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు

ABOUT THE AUTHOR

...view details