Handicapped Seeking for Help: కర్నూలు జిల్లా కోసిగి మండలం గౌడగల్లు గ్రామానికి చెందిన చిన్న ఈరన్న, నరసమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. కుమారులిద్దరూ మానసిక వికలాంగులు. చివరి కుమారుడికి జన్మనిచ్చిన నరసమ్మ చనిపోయింది. అప్పటినుంచి ఈరన్న అన్నీ తానై పిల్లలను పోషించాడు. ముగ్గురు కుమార్తెలకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు. దివ్యాంగులైన ఇద్దరు మగపిల్లను ఈరన్న కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. కొంత కాలానికి ఈరన్న మృతి చెందాడు. తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోవడంతో దివ్యాంగులైన ఇద్దరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
ఇదీ చదవండి :తగ్గిన పొగాకు దిగుబడి... తీవ్రంగా నష్టపోయిన రైతులు
Handicapped Brothers in Gowdagallu : తండ్రి ఈరన్న చనిపోవడంతో... ఇద్దరు దివ్యాంగ సోదరులను చూసుకునేందుకు... అక్క మాదేవి వారికి అమ్మయింది. తన భర్త ఆంజనేయులుని ఒప్పించి మరీ ఇద్దరి తమ్ముళ్ల ఆలనా పాలనా చూస్తోంది. రెక్కాడితే కానీ తమకు డొక్కాడదని ఆవేదన చెందుతోంది. కష్టం చేస్తే తప్ప నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లవని... తన కుటుంబంతో పాటు తమ తమ్ముళ్ల పోషణ భారంగా మారిందని మాదేవి కన్నీటి పర్యంతమవుతోంది. తన తమ్ముళ్లు దివ్యాంగులైనప్పటికీ.. రెండేళ్లుగా వారికి పింఛన్ కూడా రావట్లేదని ఆవేదన చెందుతోంది. మనసున్న మారాజులు తమకు సాయం చేసి ఆదుకోవాలని..ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తోంది ఆ కుటుంబం.