ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అనాథ మృతదేహాలకు అంతిమ సంస్కారి! - కర్నూలు తాజా వార్తలు

రోడ్డు మీద మృతిదేహం పడి ఉన్నా... మనకెందుకులే అనుకుని కనీసం అటువైపు చూడకుండా వెళ్లిపోయేవారే ఎక్కువ. అలాంటిది అనాథ శవం కనిపిస్తే చాలు... వెంటనే నేనున్నానంటూ ముందుకు వచ్చి... గౌరవంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడో ఓ వ్యక్తి. 'ఆ నలుగురు' అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. అతను ఎవరో తెలియాలంటే కర్నూలు జిల్లా వెళ్లాల్సిందే.

aa naluguru
ఆ నలుగురు

By

Published : Oct 7, 2020, 2:37 PM IST

ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు వన్నూరు బాషా. ఇతనిది కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం కొలుములపల్లె గ్రామం. బేతంచర్లలో వెల్డింగ్ దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు. 2011లో... రైల్వేస్టేషన్​లో దిగి దుకాణానికి వెళుతుండగా... అనాథ శవం పడి ఉండటం చూశారు. అప్పటికే శరీర భాగాలు ఎలుకలు కొరికి ఉండటం గమనించారు. ఇలాగే వదిలేస్తే... జంతువులు పీక్కుతినే అవకాశం లేకపోలేదని భావించి... స్నేహితుల సహకారంతో అంత్యక్రియలు చేశారు. నాటి నుంచి నేటి వరకు 70కి పైగా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించి ఔదార్యం చాటుకున్నారు. ఔరా అనిపించుకున్నారు.

2017లో స్థాపన..

తాను చేసే సేవా కార్యక్రమాల కోసం ఓ వేదిక ఉండాలన్న ఉద్దేశంతో... 2017 అక్టోబర్​లో 'ఆ నలుగురు' స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఓ కమిటీని ఎన్నుకున్నారు. ఇందులో 15 మంది సభ్యులు ఉన్నారు. మరో 15 మంది మద్దతుదారులు సహాయ సహకారాలు అందిస్తున్నారు. బేతంచర్ల పట్టణం సహా మండలంలో ఏ గ్రామంలో అనాథ శవాలు ఉన్నా... వెళ్లి వారి అంత్యక్రియలు చేస్తూ... సేవా నిరతిని చాటుతున్నారు. కరోనా కష్టకాలంలో సొంత బంధువులే.... చనిపోయినవారిని తాకటానికి ఇష్టపడటం లేదు. అలాంటి పరిస్థితుల్లోనూ... పది మందికి అంత్యక్రియలు నిర్వహించారు.. బాషా.

సొంత డబ్బులతోనే సేవలు...

కేవలం అంత్యక్రియలు మాత్రమే కాదు. వికలాంగులకు పరికరాలు ఇప్పించటం, శ్మశానం అభివృద్ధి, మొక్కలు నాటటం, వేసవిలో చలివేంద్రం ఏర్పాటు వంటి కార్యక్రమాలు సైతం చేస్తున్నారు. ఎవరినీ అడగకుండా... సొంత డబ్బులతోనే ఇలాంటివి చేస్తుండటం గమనర్హం. గతేడాది ఓ శవానికి అంత్యక్రియలు చేయటానికి డబ్బులు లేకపోతే... ఇంట్లోని ఫ్రిడ్జ్ అమ్మి... డబ్బులు సమకూర్చారు.

భార్య, పిల్లలు సైతం బాషాకు సహకరిస్తున్నారు. ఆ నలుగురు సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలకు తనవంతు సాయంగా... ఆర్థిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి 5 సెంట్ల స్థలాన్ని ఇచ్చినట్లు చెబుతున్నారు. అనాథ మృతదేహాలు కాదు... ఆ నలుగురు ఉన్నారు అంటూ... గర్వంగా చెబుతున్నారు వన్నూరు భాషా.

ఇదీ చదవండి:

కుప్పగల్లులో కుల వివక్ష.. కలెక్టర్, ఎస్పీ ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details