కర్నూలు విమానాశ్రయం నుంచి విమాన ప్రయాణ సేవలు మార్చి తర్వాతే అందుబాటులోకి రానున్నాయి. కొత్త మార్గాలకు విమానాలను మార్చి నెల వరకు సర్దుబాటు చేయటం సాధ్యం కాదని ఇండిగో సంస్థ తెలపడంతో జనవరి నుంచి సేవలు ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉడాన్-4 పథకం కింద కర్నూలు నుంచి విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు మార్గాల్లో సర్వీసులను నడపటానికి అందుబాటులో ఉన్న స్లాట్ ఆధారంగా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అనుమతించింది.
ఈ మార్గంలో మూడేళ్లపాటు ఇండిగో సంస్థ మాత్రమే సర్వీసులు నడపటానికి వీలుగా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతులు జారీ చేసింది. కర్నూలు నుంచి వేరే ప్రాంతాలకు సర్వీసులు నడిపేందుకు ఇతర విమానయాన సంస్థలతో రాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్) స్పైస్‌జెట్, ట్రూజెట్‌తో పాటు పలు సంస్థలతో చర్చలు జరుపుతోంది. అధికారికంగా సేవలు ప్రారంభించిన తర్వాత కొత్త సర్వీసులను దశల వారీగా ప్రవేశపెడతామని ఏపీఏడీసీఎల్ అధికారులు తెలిపారు. కర్నూలు నుంచి వాణిజ్య సేవలను ప్రారంభించటానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇటీవల అనుమతులు జారీ చేసింది.