కర్నూలు జిల్లాలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగాయని... ప్రజలంతా భయపడుతున్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆందోళన వ్యక్తం చేశారు. 4 రోజుల క్రితం వరకూ 4-5 కరోనా కేసులు మాత్రమే ఉన్న కర్నూలులో ఒక్కసారే 180 పెరగటానికి కారణం ఎవరని నిలదీశారు. కేసులు పెరగటానికి స్థానిక ఎమ్మెల్యేనే కారణమని అంతా అంటున్నారని విమర్శించారు. ప్రజా ప్రతినిధులు స్పందించకపోగా ప్రశ్నించే వారిపై విచారణ చేయాలనడం దుర్మార్గమని ఆక్షేపించారు.
ప్రజల ప్రాణాలతో ఆడుకుంటుంటే కూడా ప్రశ్నించకూడదు అన్నట్లుగా ప్రభుత్వం తీరుందని అఖిలప్రియ మండిపడ్డారు. కరోనాను తేలిగ్గా తీసుకుని పారాసిటమాల్ వేసుకుంటే చాలంటూ ముఖ్యమంత్రి తొలుత తప్పుడు ప్రచారం చేసినందుకే కరోనా తీవ్రత రాష్ట్రంలో పెరిగిందని ఆరోపించారు. ఎన్నికల సంఘం కరోనా తీవ్రతను గుర్తించి స్థానిక ఎన్నికలు వాయిదా వేసినప్పుడే ప్రభుత్వమూ అప్రమత్తమై ఉంటే ఇంత తీవ్రత ఉండేది కాదని అభిప్రాయపడ్డారు.