Days baby girl left in Thorn bushes : తొమ్మిది నెలలు మోసినపుడు కాని బరువు.. బయటకు వచ్చాక అయ్యిందేమో..పేగు బంధం మరిచిందేమో..ఆడపిల్లని వద్దనుకుందో ఆ తల్లి.. లేక తల్లికి తెలియకుండా వదిలివేశారో తెలియదు కానీ..రోజుల పాప ఊరి బయట కనిపించింది. చల్లని చలికి తల్లి పొత్తిళ్లలో వెచ్చగా నిద్రించాల్సిన ఆ పసికందు గ్రామ సరిహద్దు ముళ్లపొదల్లో ఏడుస్తూ దర్శనమిచ్చింది.
కర్నూలు జిల్లా ఇ.తాండ్రపాడు గ్రామ సరిహద్దుల్లోని చెట్లకింద ముళ్ల పొదల్లో రోజుల పాపను గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లిన ఘటన చోటు చేసుకుంది. అటువైపు వెళ్తున్న స్థానికులు పాప ఏడుపు విని ఆ ప్రాంతాన్ని పరిశీలించగా ముళ్లపొదల్లో ముద్దులొలికే చిన్నారి కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు గ్రామస్థులు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారిని ఇ.తాండ్రపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ వినోద్ కుమార్ చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పాప ఆరోగ్యం బాగుందని ఆయన తెలిపారు.