కరోనా కష్ణకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచి సామాన్యులపై భారం మోపిందని సీపీఎం పోలీట్ బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు ఆరోపించారు. సీపీఎం ఆధ్యర్యంలో కర్నూలు లలిత కళా సమితిలో బాజపాను తిప్పికొట్టండి.. దేశాన్ని రక్షించండి అంటూ.. భాజపా ప్రజావ్యతిరేక విధానాలపై సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీవీ.రాఘవులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పరిస్థితుల్లో ప్రజలకు మేలు జరగాలంటే కేంద్రంలో భాజపా ప్రభుత్వం దిగిపోవాలి.. లేదా పార్టీ తన విధానాలనైనా మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్లో చర్చలేకుండా బిల్లులు ఆమోదించుకునే సంస్కృతిని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. భాజపా విధానాలపై రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎందుకు మౌనం వహిస్తున్నాయో అర్థం కావడంలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 27న చేపట్టిన భారత్ బంద్కు వైకాపా, తెదేపాలు మద్దతు ఇవ్వాలని బీవీ.రాఘవులు కోరారు.