శాంతియుతంగా జరుగుతున్న అమరావతి రైతుల ఉద్యమానికి(amaravati farmers protest) ఆటంకాలు కలిగిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమానికి(jail bharo) పిలుపునిస్తామని సీపీఐ నాయకుడు నారాయణ(CPI leader narayana) హెచ్చరించారు. కర్నూలులో జరుగుతున్న శాఖా కార్యదర్శుల వర్క్షాప్ను ఆయన ప్రారంభించారు. అమరావతి ఉద్యమంలో అసాంఘిక శక్తులు లేవని, అధికార వైకాపాలో రౌడీలు, గూండాలు ఉన్నారని నారాయణ ఆరోపించారు. ప్రత్యేక హోదా(special status) ఇస్తామని చెప్పి, భాజపా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 14న తిరుపతి పర్యటనకు వస్తున్న కేంద్రమంత్రి అమిత్ షా(amit shah tirumala tour) ను అడ్డుకుంటామని వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగా పెంచి, కేవలం 5 రూపాయలు తగ్గించారని ఎద్దేవా చేశారు. అదానీ పోర్టుల ద్వారానే దేశంలోకి మాదకద్రవ్యాలు వస్తున్నాయని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు.
అమరావతి రైతు ఉద్యమానికి ఆటంకం కలిగిస్తే జైల్ భరో కార్యక్రమానికి పిలుపునిస్తాం. అమరావతి రైతుల్లో అసాంఘిక శక్తులు ఏమీ లేవు. శాంతియుత ఉద్యమంపై నిందలు సరికాదు. అధికార వైకాపాలోనే రౌడీలు, గూండాలు ఉన్నారు. ఈనెల 14న అమిత్ షా తిరుపతి పర్యటన అడ్డుకుంటాం. - నారాయణ, సీపీఐ నేత నారాయణ
మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి...
న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై కేసులు పెట్టడాన్ని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తప్పుబట్టారు. ఈ చర్యతో ప్రభుత్వం తన గొయ్యి తానే తవ్వుకుంటోందని మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న న్యాయబద్ధమైన డిమాండ్ తో రైతులు చేపట్టిన పాదయాత్రకు అవాంతరాలు సృష్టించడం సరికాదన్నారు. పాదయాత్రకు ఆంక్షలు విధించడం, మద్ధతు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికమని అభిప్రాయపడ్డారు. రైతుల పాదయాత్ర ముగిసేలోపు మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.