ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పరిహారం.. ఫలహారం.. - kurnool district newsupdates

ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం అందించే అరకొర పరిహారానికీ గిల్లుడు తప్పడం లేదు. అధికార పార్టీ నేతల అండదండలతో పంటల నష్టంపై గణన గుడ్డిగా సాగింది. అర్హులకు మొండిచేయి చూపించి, అనర్హులకు పెద్దపీట వేశారు. పంట నీట మునగని వారికి నగదు జమవ్వగా, నిజమైన బాధితులకు గుండెకోత మిగిల్చారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో నష్టం వాటిల్లిన పంటలకు ఈ సీజన్‌లోనే తక్షణమే పరిహారం ఇస్తున్నామంటూ ఢంకా మోగిస్తున్నా.. అనర్హులకే లబ్ధి చేకూరిన వైనంపై కథనం.

Compensation Breakfast  at kurnool district
పరిహారం.. ఫలహారం..

By

Published : Nov 8, 2020, 4:21 PM IST

జిల్లాలో ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు అధిక వర్షాలు కురిశాయి. 33 శాతం కంటే ఎక్కువ దెబ్బతిన్న పంటలను రెవెన్యూ, వ్యవసాయాధికారులు నష్టంపై గణన చేసి నివేదికలు ప్రభుత్వానికి పంపారు. వీటికోసం ఇన్‌పుట్‌ రాయితీ(పంట నష్టం) పరిహారం జిల్లాకు రూ.42.39 కోట్లు మంజూరైంది. ఇప్పటికే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతోంది. వరి, వేరుశనగ, పత్తి, మిరప, ఉల్లి, కూరగాయలు, పూలతోటలకు హెక్టారుకు రూ.15 వేలు, మొక్కజొన్నకు రూ.12,500, పప్పుధాన్యాలు, పొద్దుతిరుగుడు, సోయాబీన్‌కు రూ.10 వేలు, ఉద్యాన..నర్సరీలకు రూ.7500, కొర్రకు రూ.5 వేలు, అరటికి రూ.25 వేలు చొప్పున పరిహారం పంపిణీ చేశారు.

నిలదీసినా తప్పు ఒప్పుకోరే!

పత్తికొండ పరిధిలోని జూటూరు గ్రామంలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హంద్రీ వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న పొలాలు వరద నీటితో మునిగిపోయాయి. వీఆర్వో, గ్రామ వ్యవసాయ సహాయకులు సంయుక్తంగా పంట నష్టం గణన చేసి నివేదికలు పంపారు. 177 మంది రైతులకు రూ.16.12 లక్షల పరిహారం వచ్చింది. అనర్హులకు ఎక్కువ మందికి రాశారంటూ ఈ నెల 4న కొందరు అర్హులు వీఆర్వోను నిలదీశారు. ఆలూరు పరిధిలోని పెద్దహోతూరులో రైతులకు నష్టం వాటిల్లినా పరిహారం రాయలేదంటూ రైతు సంఘం నాయకులు జేసీకి వినతి పత్రం అందజేశారు.

నష్టాన్నీ ఇలా బొక్కేశారు...

పంట నష్టం జాబితా తయారీలోనే అక్రమాలు చోటుచేసుకున్నాయి. స్థానిక వైకాపా నేతలు సూచించిన వారి పేర్లు అధికారులు నమోదు చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పంట మునగని, పంటే వేయని బీడు భూములకు, ప్రభుత్వ ఉద్యోగులకు పంట నష్టం నమోదు చేసి బొజ్జలు నింపారు. గడివేముల మండలంలోని కొర్రపోలూరు గ్రామంలో 365 డీ1 సర్వే నెంబరులోని భూమిలో ప్రస్తుతం కొంత భూమి బీడు, 21/2ఏ సర్వే నెంబరులో భూమి పదేళ్లుగా బీడుగా ఉన్నా...వాటిలో పత్తి సాగు చేసినట్లు, నష్టం వాటిల్లినట్లు పరిహారం మంజూరు చేయడమే దీనికి తార్కాణం. గడివేముల గ్రామంలో ఉద్యోగులను రైతులుగా చూపించి పరిహారం జాబితాలో చేర్చారు. ఇలా జిల్లా అంతటా అనర్హులకు పెద్దపీట వేశారు.

సరిదిద్దుకునే ప్రయత్నం.....

డోన్‌ మండలం కొత్తకోట గ్రామ పంచాయతీలో వెంగళాంపల్లి చెరువు నిండి నీరు పొలాల్లోకి రావడంతో పంటలు నీట మునిగాయి. వాస్తవంగా 30 మందికి నష్టం వాటిల్లగా, ఆ గ్రామంలోని రైతులందరి పేర్లు వ్యవసాయాధికారులు నమోదు చేసి నష్ట పరిహారానికి పంపారు. ఈ గ్రామానికి రూ.23 లక్షలు పరిహారం మంజూరైంది. వేరుశనగ పంట వేయని రైతులకు, నష్టపోనివారికి పరిహారం మంజూరు చేసి, నిజమైన కర్షకులకు ఎందుకు ఇవ్వలేదంటూ కొందరు ప్రశ్నించడంతో అసలు కథ బయటపడింది. దీంతో పంపిణీ చేయకుండా మిగిలిన రూ.7.50 లక్షల పరిహారాన్ని వెనక్కి పంపారు. సాగుదారులతో అధికారులు మాట్లాడి వేరుశనగ పంట పరిహారంలో సర్దుబాటు చేస్తామంటూ సముదాయించినట్లు రైతులు తెలిపారు.

నష్టపోయిన రైతులు: 53,009

విడుదల చేసిన పరిహారం: రూ.42.39 కోట్లు

వ్యవసాయశాఖ పరిధిలో: 2,746 హెక్టార్లు

రైతులు: 47,698 మంది

అందే పరిహారం: రూ.38.13 కోట్లు

ఉద్యాన పంటలు: 2,815 హెక్టార్లు

రైతులు: 5,314

పరిహారం: రూ.4.26 కోట్లు

ఇదీ చదవండి:

కుటుంబం ఆత్మహత్య కేసు: నంద్యాలకు చేరుకున్న విచారణ కమిటీ

ABOUT THE AUTHOR

...view details