CJI Justice NV Ramana Srisailam Visit: శ్సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వారితోపాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్రశర్మ దంపతులు కూడా ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు సుప్రభాత సేవకు హాజరయ్యారు. వారికి ఆలయ రాజగోపురంవద్ద వేద పండితులు పూలదండలు వేసి మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. రత్నగర్భ గణపతి పూజ అనంతరం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. మహా మంగళ హారతిలో పాల్గొని, గర్భగుడిలోని మూలవిరాట్‌కు మహాన్యాస రుద్రాభిషేకం చేశారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరోది అయిన శ్రీభ్రమరాంబ ఆలయంలో కుంకుమార్చన చేశారు. జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులు, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ దంపతులకు పండితులు వేద ఆశీర్వచనాలందించారు. స్వామి, అమ్మవార్ల చిత్రపటాలు బహూకరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కృష్ణదేవరాయ గోపురం ఎదురుగా ఉన్న కంచి కామకోటి శంకర మఠంలో రెండోరోజు సోమవారం ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన చŸండీహోమం, రుద్రహోమాలతోపాటు పూర్ణాహుతి క్రతువుల్లోనూ జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులు, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ దంపతులు పాల్గొన్నారు.
శ్రీశైలం ఆనకట్ట సందర్శన: ఆలయాల సందర్శన అనంతరం న్యాయమూర్తులు నందినికేతన్ గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్న భోజనం చేశారు. ఒంటి గంటకు పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత రోడ్డుమార్గాన హైదరాబాద్‌కు బయల్దేరారు. మార్గమధ్యంలో న్యాయమూర్తులు శ్రీశైలం ఆనకట్టను సందర్శించారు. నీటి పారుదలశాఖ అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.