కర్నూలు జిల్లాలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇంతకాలం పదుల సంఖ్యలో వచ్చిన పాజిటివ్ కేసులు.. గురు, శుక్రవారాల్లో ఏడు చొప్పున నమోదయ్యాయి. నగరంలో రెండు రోజుల్లో కేవలం మూడు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇప్పటి వరకూ జిల్లావ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 547కు చేరింది. శుక్రవారం మరో ఇద్దరు మృత్యువాత పడగా.. మొత్తం మరణాల సంఖ్య 14కు చేరింది. ఇప్పటివరకు 191 మంది డిశ్చార్జి అయ్యారు. 342 మంది కొవిడ్ ఆస్పత్రుల్లో కోలుకుంటున్నారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలకు వైరస్ నిర్ధారణ అవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో లాక్డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు.
కేంద్ర బృందం పర్యటించే అవకాశం
కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న కర్నూలు, నంద్యాల సహా ఇతర ప్రాంతాల్లో శనివారం కేంద్ర బృందం పర్యటించే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలో కరోనా నియంత్రణ కోసం చేపట్టిన చర్యలు.. కంటైన్మెంట్, రెడ్ జోన్లు, క్వారంటైన కేంద్రాలు, వాటిలో కల్పిస్తున్న వసతులు, కరోనా పరీక్షలు, కోవిడ్ ఆసుపత్రులు, డాక్టర్ల పనితీరు, పారిశుద్ధ్యం, లాక్డౌన్ అమలు తీరు తదితర అన్ని అంశాలపై అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. వీటిని కేంద్ర బృందానికి సమర్పించనున్నారు.. కేంద్ర బృందం సూచనలను విధిగా పాటించాలని అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.