BJP leader Vishnuvardhan Reddy House arrest: కర్నూలు జిల్లా ఆత్మకూరులో జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి నిలదీశారు. ఘర్షణలో గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళుతున్న విష్ణువర్ధన్ రెడ్డితో పాటు పలువురు నాయకులను కర్నూలులో పోలీసులు గృహనిర్బంధం చేశారు.
ఆత్మకూరులో శనివారం రాత్రి జరిగిన ఘటనను ఉగ్రవాద కోణంలో పోలీసులు విచారణ జరుపాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధితులపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదని హెచ్చరించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులను స్వేచ్ఛగా పనిచేయనివ్వడంలేదని ఆరోపించారు. పోలీసులపై రాజకీయ జోక్యం లేకుండా స్వేచ్ఛగా విచారణ జరిపించాలని కోరారు. బుడ్డా శ్రీకాంత్ రెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఆత్మకూరు ఘటనను కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకపోతామన్నారు.
ఆత్మకూరు పట్టణంలో పరిస్థితి అదుపులో ఉంది. శనివారం అల్లర్లకు పాల్పడిన వారిపై 5 కేసులు నమోదు చేసి... 28 మందిని అరెస్టు చేశాం. ఈ ఘటనలో ఓ కారు సహా మూడు ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -సుధీర్ కుమార్ రెడ్డి , కర్నూలు ఎస్పీ