సొంత చెల్లికే న్యాయం చెయ్యలేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM YS JAGAN)పై.. ప్రజలు ఏవిధంగా నమ్మకం పెట్టుకుంటారు.. అంటూ భాజపా (BJP) నేతలు కర్నూలులో వ్యాఖ్యానించారు. నగరంలో భాజపా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. 2019 ఎన్నికల సమయంలో మంచి పాలన అందిస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించారని.. జనతా కిసాన్ మోర్చా జాతీయ నాయకులు సురేష్ రెడ్డి(suresh reddy) అన్నారు. సొంత బాబాయ్ హత్యకేసును పరిష్కరించని వైకాపా ప్రభుత్వం.. ప్రజలకు ఏం న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. అన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ చెల్లి తెలంగాణలో రాజకీయాలు చెయ్యడం రాజకీయ కుతంత్రాలు కాదా అని ఆయన ప్రశ్నించారు.
రాయలసీమకు అన్యాయం జరుగుతోంది
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి(Vishnuvardhan Reddy) ఆరోపించారు. తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయాలని చూస్తున్న అంశాన్ని.. ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ(Telangana), ఏపీ(AP) తీసుకుంటున్న నిర్ణయాలతో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. సీఎం జగన్(CM Jagan) రాయలసీమ హక్కులను ఫణంగా పెట్టి.. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు.