కర్నూలులోని ఓర్వకల్ విమానాశ్రయంలో విమానాల మరమ్మతులు, నిర్వహణ (ఎంఆర్‌వో) కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్) భావిస్తోంది. ఇక్కడి నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఎంఆర్‌వో కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలను అమలు చేయనుంది. డిసెంబరు మొదటి వారంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ (డీజీసీఏ) పరిశీలన పూర్తయిన తర్వాత కర్నూలు విమానాశ్రయం నుంచి వాణిజ్య సేవలను ప్రారంభించటానికి అవసరమైన అనుమతులను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ జారీ చేయనుంది. దీంతోపాటు ఎంఆర్‌వో కేంద్రాన్ని ఏర్పాటు చేయటంవల్ల మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవటానికి అవకాశం ఉంటుందని ఏపీఏడీసీఎల్ భావిస్తోంది.
శంషాబాద్.. బెంగళూరు వెళ్లాలి
ప్రస్తుతం విమానాల నిర్వహణ కోసం బెంగళూరు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ రెండు విమానాశ్రయాల్లో సర్వీసుల సంఖ్య పెరగటం వల్ల రద్దీ ఎక్కువగా ఉంది. దీనివల్ల క్లియరెన్స్ త్వరగా దొరకటం లేదు. నిర్వహణ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల రాష్ట్రంలో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఏపీఏడీసీఎల్ భావిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసే విమానాశ్రయం కావడంవల్ల సర్వీసులు పెద్దగా ఉండవు. వెంటనే క్లియరెన్స్ దొరకటంతోపాటు నిర్వహణ వ్యయం తక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక్కడే పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సంస్థల నుంచి టెండర్లను కోరింది.