ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బెట్టింగ్​కు బానిసై... అప్పులకు బలై...! - కర్నూలు వార్తలు

బెట్టింగ్ భూతం మరో ప్రాణాన్ని బలిగొంది. అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువకుడు క్రికెట్​ బెట్టింగ్​ కోసం రూ.లక్షల్లో అప్పులు చేశాడు. రుణదాతల ఒత్తిడితో చెక్కులు, ప్రామిసరీ నోట్లు రాసిచ్చాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

betting
betting

By

Published : Dec 12, 2020, 9:11 AM IST

Updated : Dec 12, 2020, 9:47 AM IST

కర్నూలు శివారు గుత్తి పెట్రోల్ ‌బంకు సమీపంలోని ఓ హోటల్‌ వెనుక కమ్మరి మహానందయ్య (30) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా పామిడి మండలం సి.రామరాజుపల్లికి చెందిన మహానందయ్యతో డోన్‌కు చెందిన యువతితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమార్తె. మహానందయ్య గుత్తిలో బట్టల దుకాణం నడిపేవాడు. నష్టాల కారణంగా మూసివేశాడు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు జూదం, క్రికెట్‌ బెట్టింగులకు అలవాటుపడ్డాడు. రూ.లక్షల్లో అప్పులు చేసి తీర్చలేకపోయాడు. రుణదాతలు ఒత్తిడి చేసి చంపుతామని హెచ్చరించగా.. చెక్కులు, ప్రామిసరీ నోట్లు రాసిచ్చాడు.

ఇటీవల భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్లగా తాను కూడా డోన్‌కు వచ్చి బేకరీలో పనికి చేరాడు. గురువారం సాయంత్రం భార్యకు ఫోన్‌ చేసి తాను కర్నూలు వచ్చానని, ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. కుటుంబసభ్యులు పలుచోట్ల గాలించారు. ఇంతలోనే.. శుక్రవారం ఉదయం కర్నూలు శివారులో మహానందయ్య శవమై తేలాడు. శీతల పానీయంలో పురుగుల మందు కలిపి తాగినట్లు పోలీసులు గుర్తించారు. అతని వద్ద చిన్న పుస్తకంలో రాసిన సూసైడ్‌ నోట్‌లో అప్పులు ఇచ్చినవారు పెట్టే బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. తల్లిదండ్రులు, భార్య తనను క్షమించాలని, కుమార్తె క్రికెటర్‌ కావాలని కోరాడు. ఎవరూ క్రికెట్‌ బెట్టింగ్‌ జోలికి వెళ్లొద్దని అందులో రాశాడు. కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Dec 12, 2020, 9:47 AM IST

ABOUT THE AUTHOR

...view details