తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థపై పట్టు కోసం వేచి చూసిన వైకాపా.. మేయర్, ఉప మేయర్-1 పదవీ కాలం నాలుగేళ్లు పూర్తవడంతో వారిని పదవుల నుంచి తప్పించడానికి పావులు కదిపింది. తెదేపా అసమ్మతి, భాజపా, స్వతంత్ర కార్పొరేటర్ల సహకారంతో అవిశ్వాస అస్త్రం ప్రయోగించింది. ఉప మేయర్-2 ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం 33 మంది కార్పొరేటర్ల సంతకాలతో కూడిన లేఖను కలెక్టర్ హరికిరణ్‌కు అందజేశారు. నాలుగేళ్లు మేయర్, ఉప మేయర్-1గా పనిచేసిన వీరు నగరాభివృద్ధికి ఏమీ చేయలేదనీ, మహిళా కార్పొరేటర్లకు సముచిత స్థానం కల్పించలేదనీ, వీరి పాలన తమకొద్దనీ.. వీరిని మార్చడానికి ప్రత్యేక సమావేశం నిర్వహించాలని పేర్కొన్నారు. లేఖను పరిశీలించిన కలెక్టర్ కార్పొరేటర్ల సంతకాలు సరిచూసి, ప్రత్యేక సమావేశానికి నోటీసులు ఇస్తామన్నారు.
అంతా వ్యూహాత్మకం
అవిశాస్వం కోరుతూ లేఖ అందజేసిన కొద్ది నిమిషాలకే కమిషనర్ స్వప్నిల్, అధికారులు కలెక్టరేట్‌కు చేరుకోవడం గమనార్హం. కార్పొరేటర్లు లేఖ ఇచ్చిన రోజు నుంచి ప్రత్యేక సమావేశం నిర్వహించే తేదీకి కచ్చితంగా 15 రోజుల వ్యవధి ఉండాలని మున్సిపల్ చట్టం పేర్కొంటోంది. ఈ వ్యవధి దాటాకే ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసే వీలుంది. ఈలోగా కార్పొరేటర్లు అవిశ్వాసం కోరుతూ ఇచ్చిన లేఖలోని సంతకాలు వీరివా.. కాదా.. అని పరిశీలించి సక్రమంగా ఉంటే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తారు. జిల్లాస్థాయి అధికారి ప్రిసైడింగ్ అధికారి హోదాలో ప్రత్యేక సమావేశం నిర్వహించి, అవిశ్వాసంపై ఓటింగ్‌కు వెళతారు. ప్రస్తుత కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు.. 47 మందిని ఆహ్వానిస్తారు. వీరిలో 31 మంది హాజరైతే కోరం సరిపోతుంది. వచ్చిన వారిలో 50 శాతం, మరొక ఓటు అవిశ్వాసానికి అనుకూలంగా వస్తే, మేయర్, ఉపమేయర్-1 పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఆపై... ఇక్కడ చేసిన తీర్మానం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. అక్కడి నుంచి మేయర్, ఉపమేయర్-1 ఎన్నికకు నోటిఫికేషన్ రాగానే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కొత్తవారిని ఎన్నుకుంటారు.