పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి చాలా ముఖ్యమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును ఎందుకు నిలిపివేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విశాఖను అభివృద్ధి చేస్తామని సీఎం జగన్ చెబుతున్నారన్న యనమల... ప్రభుత్వ వైఖరి కారణంగా విశాఖకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు.
'రాష్ట్రం ప్రతిష్ఠ పోయినపుడు పెట్టుబడులు ఎలా వస్తాయి..?'
రాష్ట్రం ప్రతిష్ఠ పోయినపుడు పెట్టుబడులు ఎలా వస్తాయని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుందని యనమల ప్రశ్నించారు. వ్యాపారం జరగకపోతే పన్నులు ఎలా వస్తాయి..? అని నిలదీశారు. రాష్ట్రం ప్రతిష్ఠ పోగొడితే అప్పులు ఎలా వస్తాయని ప్రశ్నల వర్షం కురిపించారు. అప్పులు ఇడిగితే ఇచ్చేవాళ్లు కూడా లేరన్న యనమల... కేంద్ర ప్రభుత్వం అరకొరగా నిధులు ఇస్తోందని పేర్కొన్నారు.
రాజధాని మార్పు యోచనతో మహిళలను రోడ్డెక్కించారని యనమల ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌కు అందరూ బినామీలేనని ఆరోపించారు. బినామీలే బినామీల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వాలంటీర్లను పెట్టి ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారని విమర్శించారు. రాజధానిగా అమరావతిని కొనసాగించి... అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి సూచించారు.