సంచలనం సృష్టించిన.... ఎస్సీ యువకుడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి... పోలీసుల వాదనలు వివాదాస్పదమవుతున్నాయి. హత్యానేరం అంగీకరించిన వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్.... వాంగ్మూలంలో చెప్పిన అంశాలనే పూసగుచ్చినట్లు వివరించారు కానీ.... అసలు తమ దర్యాప్తులో ఏం తేలిందనే విషయాన్ని చెప్పలేదంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చెప్పిన అంశాలకు, క్షేత్ర స్థాయి వాస్తవాలకు పొంతన కుదరట్లేదు.
ఎస్పీ చెప్పింది ఇదీ: ఈ నెల 19న రాత్రి 8.30 గంటల సమయంలో సుబ్రహ్మణ్యం ఆయన స్నేహితులతో కలిసి ఇంటి నుంచి బయటకొచ్చారు. కొండయ్యపాలెంలోని నవభారత్ స్కూల్ ప్రాంగణంలో రాత్రి 10.15 వరకూ మద్యం తాగారు. ఆ సమయంలో కారులో అటువైపు వెళ్తున్న ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని చూసి తనతోపాటు వాహనంలో తీసుకెళ్లారు.
అనుమానం ఇదీ: ఎస్పీ వాదనకు పూర్తి భిన్నంగా మృతుడి భార్య అపర్ణ వాదన ఉంది. ‘ఎమ్మెల్సీ అనంతబాబు పుట్టినరోజు నాలుగు నెలల కిందటే అయిపోయింది. అయినా తన పుట్టినరోజని చెప్పి 19న నా భర్తను ఇంటి నుంచి అనంతబాబు తీసుకెళ్లారు. ఆయన రహస్యాలు, వివాహేతర సంబంధాల గురించి నా భర్తకు తెలుసు. అందుకే చంపేసి శవాన్ని ఇంటికి తీసుకొచ్చారు’ అని వాపోయారు. పోలీసులు ఆ వాదనను పట్టించుకోలేదు. పోలీసులు చెబుతున్నదే నిజమనుకున్నా... సుబ్రహ్మణ్యం ఉన్న వైపే అనంతబాబు కారు వెళ్లటం, అతన్ని చూడటం కాకతాళీయమా? పథకం ప్రకారమే జరిగిందా? అనే అనుమానాలున్నాయి.
ఎస్పీ చెప్పింది: సుబ్రహ్మణ్యం తన పెళ్లికి అనంతబాబు నుంచి కొంత అప్పు తీసుకున్నారు. అందులో రూ.20వేలు ఇంకా ఇవ్వాలి. ఆ డబ్బుల కోసం అడుగుతుండగా సుబ్రహ్మణ్యం ఎదురుతిరిగారు. దీంతో ఎమ్మెల్సీ అహం దెబ్బతిని, క్షణికావేశంలో మెడ పట్టుకుని తోసేయగా సుబ్రహ్మణ్యం తలకు గాయాలయ్యాయి. అతన్ని అనంతబాబు తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. దారిలోనే సుబ్రహ్మణ్యం చనిపోయాడు.
అనుమానం:అనంతబాబు ఆర్థికంగా బాగానే ఆర్జించారు. అలాంటి వ్యక్తి కేవలం రూ.20వేల కోసం డ్రైవర్‌తో గొడవ పెట్టుకుంటారా? పోలీసులు చెబుతున్నట్లు అహం దెబ్బతినటం వల్లనో, క్షణికావేశంలో తోసేయటం వల్లనో సుబ్రహ్మణ్యం గాయపడి ఉంటే అప్పుడే ఆ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పలేదు. వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారు?
ఎస్పీ చెప్పింది:సుబ్రహ్మణ్యం చనిపోయిన తర్వాత ఆందోళనకు గురైన ఎమ్మెల్సీ అనంతబాబు దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. నిర్మానుష్య ప్రాంతానికి మృతదేహాన్ని తీసుకెళ్లి కారులో నుంచి దించారు. అక్కడ చుట్టూ నరికేసిన చెట్లు ఉన్నాయి. వాటిల్లో నుంచి ఓ కర్ర తీసుకుని మృతదేహం తొడలు, చేతులు, భుజం, వీపుపై కొట్టారు. శరీరం అంతటా గాయాలు చేశారు. ఆ తర్వాత అక్కడున్న తాళ్లతో కట్టి మృతదేహాన్ని వాహనంలోకి ఎక్కించారు.
అనుమానం:నిజంగానే చనిపోయిన తర్వాతే మృతదేహంపై గాయాలు చేశారా అనేది అనుమానాస్పదమే. బతికున్నప్పుడు కొట్టడంవల్లే సుబ్రహ్మణ్యం చనిపోయాడనేది మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపణ. గాయాలవల్లే సుబ్రహ్మణ్యం చనిపోయాడని పోస్టుమార్టం నివేదికలోనూ వెల్లడైంది. సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపారని, ఆ విషయాన్ని తెరమరుగు చేయడానికే ఎస్పీ కొత్త వాదన వినిపిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.