ఎయిడెడ్ పాఠశాల మూసేయొద్దని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కాకినాడ నగర వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిని చుట్టుముట్టి నిరసన తెలిపారు. నగరంలోని జగన్నాథపురం ప్రాంతంలోని సెయింట్ ఆన్స్ ఎయిడెడ్ బాలికల ఉన్నత పాఠశాల విలీనాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. పాఠశాల ఉపాధ్యాయులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో ప్రైవేటు ఉపాధ్యాయులతో పాఠశాల నిర్వహించక తప్పదని.. అందుకు ఫీజు చెల్లించాల్సి వస్తుందని యాజమాన్యం చెప్పడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమైంది. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల అంగీకారం కోసం సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టడంతో తల్లిదండ్రులు మంగళవారం ఆ పాఠశాలకు భారీగా చేరుకున్నారు.
ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం
ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి పాఠశాలకు సమీపంలో వైద్యశిబిరం ప్రారంభానికి వస్తున్నారని తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని తమ పిల్లల భవిష్యత్తు ఏం కావాలని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఫీజు కట్టాలని పాఠశాల యాజమాన్యం చెబుతోందని.. కూలిపనులు చేసుకుని బతికే తాము అధిక ఫీజులు ఎలా చెల్లించగలమని వాపోయారు. ఇక్కడ చదువుతున్న రెండు వేల మంది పిల్లల భవిష్యత్తుకు హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. ఎమ్మెల్యే వాహనం చుట్టూ జనం చేరి కదలనివ్వలేదు. వారు ఎంతకూ శాంతించక పోవడంతో ఎమ్మెల్యే అసహనం వ్యక్తంచేశారు.
సమస్యపై ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎలాంటి ఫీజులూ కట్టొద్దని, ముఖ్యమంత్రి దృష్టికి సమస్య తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అక్కడి నుంచే డీఈవో అబ్రహంతో ఫోనులో మాట్లాడారు. యాజమాన్యంతో ప్రజాప్రతినిధులు మాట్లాడతారనీ, పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూస్తామని భరోసా ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆందోళన విరమించారు. తర్వాత ఉప మేయర్లు, కార్పొరేటర్లు, విద్యాశాఖ అధికారులు తల్లిదండ్రులు, యాజమాన్యంతో కలిసి చŸర్చించారు. ఈనెల 28న కోర్టులో తీర్పు వస్తుందనీ, దానికి అనుగుణంగా నిర్ణయం ఉంటుందని, అప్పటి వరకూ ఆగాలని సూచించారు.
మా స్కూలు తీసుకోవద్దు...
‘మా స్కూలును, టీచర్లను తీసుకోవద్దు.. దండం పెడుతున్నాం మీరిచ్చే రూ.15 వేలు తీసుకోండి’ అని పలువురు విద్యార్థులు ఆవేదన చెందారు.