Tiger wandering in kakinada Villages: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పులి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. పోతులూరు మెట్ట పైనుంచి పులి వెళ్లినట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఒమ్మంగి, పొదలపాక పరిసరాల్లో 2 పశువులు గల్లంతైనట్లు అటవీ అధికారులు గుర్తించారు. పొదలపాక వద్ద దూడ కళేబరాన్ని వారు గమనించారు. పశువులపై పులి దాడి చేసినట్లు భావిస్తున్న స్థానికులు.. హడలిపోతున్నారు.
ఆ పాదముద్రలు పులివేనా?: కాకినాడ జిల్లా పులి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. ప్రత్తిపాడు మండలం పోతులూరు మెట్టపై పులి ఇప్పటివరకు తిష్ట వేసినట్లు అధికారులు గుర్తించారు. మెట్ట దిగువన 9 కి.మీ. దూరంలోని పాండవులపాలెం చెరువు వద్ద పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. చెరువు ఒడ్డున నీల్లు తాగిన ఆనవాళ్లు కనిపించాయి. పాండవులపాలెం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని..,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పులిని పట్టుకునేందుకు 150 మంది సిబ్బంది రంగంలోకి దిగారు. ఆయా ప్రాంతాల్లో బోన్లు సిద్ధం చేశారు. పులిని బందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.
'పెద్ద'..పులి ప్రొటోకాల్!:జాతీయ జంతువు కావడంతో పెద్దపులికి గట్టి ప్రొటోకాల్ కనిపిస్తోంది. పరిస్థితులు చేజారితే తప్ప బోనుల్లో బంధించరని తెలుస్తోంది. నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ మార్గదర్శకాలను పాటిస్తున్నారు. భయాందోళనలు పెంచే పరిస్థితులు తలెత్తినా.. పులికి ఏమాత్రం హాని కలగని రీతిలోనే బంధించి సౌకర్యంగా తరలించాలి. మొత్తం అయిదు బోనులు, మత్తుమందు ఇచ్చే తుపాకులు సిద్ధం చేశారు. మెట్ట చుట్టూ 5 కి.మీ. పరిధిలో అదనంగా ట్రాకింగ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పులి తన బాటన వెళ్లేలా ఎటువంటి వాహనాల అలజడి, మనుషుల సడి లేకుండా పోతులూరు ఒమ్మంగి రోడ్డు, ధర్మవరం నుంచి కొడవలి పుష్కర పంపు హౌస్ వరకు ఉన్న పోలవరం గట్టు రోడ్ల వెంబడి రాకపోకలు సాగకుండా స్టాపర్లు ఏర్పాటు చేశారు. 'ప్రవేశం లేదనే' బోర్డులు ఏర్పాటు చేశారు.
మళ్లీ వేటాడొచ్చు:పులి తాను వేటాడిన ఆహారం అయిపోవడం వల్ల గేదె కళేబరం వద్దకు సోమవారం రాత్రి రాలేదని జిల్లా అటవీ అధికారి ఐకేవీ రాజు తెలిపారు. రెండు మూడురోజుల్లో మళ్లీ వేటాడే అవకాశం ఉందన్నారు. పెద్దపులి చంపిన జంతువులకు పశువైద్యులు నిర్ణయించిన మేరకు నష్టపరిహారం చెల్లించామని చెప్పారు.
పెద్దపులి జాడ ఎక్కడ..? కొనసాగుతున్న వేట..! ఇవీ చదవండి: