అంతిమ సంస్కారంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ప్లాస్టిక్ కవర్లలో సీల్ చేసిన నాలుగు మృతదేహాలను చెత్త తరలించే ట్రాక్టర్‌పై శ్మశానవాటికకు తరలించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శుక్రవారం ఈ సంఘటన జరగ్గా.. దీనికి సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో శనివారం హల్‌చల్ చేశాయి.
దీనిపై కాకినాడ నగరపాలకసంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్‌ను వివరణ కోరగా.. వివిధ అనారోగ్య కారణాలతో వారు మృతి చెందారని, మృతదేహాలను తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో దహన సంస్కారాలు చేసేందుకు జీజీహెచ్ అధికారులు వినతిమేరకు అనుమతిచ్చినట్లు తెలిపారు. మృతదేహాలను ట్రాక్టర్‌పై తరలించిన అంశం తన దృష్టికి రాలేదన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ మహాలక్ష్మిని వివరణ కోరగా.. ఆసుపత్రిలో ఎవరు మృతి చెందినా మహాప్రస్థానం వాహనంలో తరలిస్తామన్నారు. ఈ ఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.