'ఎన్నికల వాయిదా కరోనా ఎఫెక్ట్ కాదు..చంద్రబాబు ఎఫెక్ట్' - kanna babu fires on chandrababu
నిష్పక్షతపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషనర్... పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మంత్రి కన్నబాబు ఆరోపించారు. కరోనా వైరస్ నేపథ్యంలో స్థానిక ఎన్నికలను 6వారాల పాటు నిలిపివేయటం వెనుక తెదేపా హస్తముందని ఆయన ఆరోపించారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతూ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కరోనా ప్రభావం రాష్ట్రంలో ఎక్కడ ఉందని ప్రశ్నించారు. పరిపాలన స్తంబింపజేయడమే ఎన్నికల కమిషనర్ ఉద్దేశమా అని ప్రశ్నించారు. ఎన్నికలు రద్దు చేయాలని సినిమా నుంచి వచ్చిన ఓ నాయకుడు చెబుతున్నారని.. ఎన్నికలు సక్రమంగా జరిగితే నిధులు వచ్చి అభివృద్ధి జరుగుతుందనే విషయం గుర్తించాలని హితవు పలికారు. స్థానిక ఎన్నికలు వాయిదా కరోనా ఎఫెక్ట్ కాదని.. చంద్రబాబునాయుడు ఎఫెక్ట్ అని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చినా శిరసా వహిస్తామని మంత్రి అన్నారు.