Kakinada SP on loan apps: లోన్ యాప్‌లను వినియోగించి ఋణాలు తీసుకుని, వేధింపులకు గురి కావద్దని జిల్లా ప్రజలకు కాకినాడ జిల్లా రవీంద్రబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం స్థానిక జిల్లా పోలీసు కార్యక్రమంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవలి కాలంలో వినిపిస్తున్న ఆన్లైన్ లోన్‌యాప్ మోసాలపై ప్రజలు జాగ్రత్త వహించాలని తెలిపారు. లోన్ యాప్స్ అనేక దారుణాలకు కూడా కారణం అవుతున్నాయన్నారు. లోన్ యాప్స్‌లో రుణాలు తీసుకొనేవారి స్మార్ట్‌ఫోన్లలోని కాంటాక్ట్స్, ఇతర వ్యక్తిగత సమాచారం యాప్ నిర్వహించేవారికి అనుసంధానించబడి రుణం తీసుకున్నవారు...ఈఎంఐ చెల్లించడంలో విఫలమైతే మానసికంగా వేధించడంతో పాటు వారి కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారికి చెబుతామని, పరువు తీస్తామని బెదిరిస్తారన్నారు. రుణాలు ఇచ్చే యాప్‌ల ప్రతినిధులు అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు డిఫాల్టర్ల చిత్రాలను 'రేపిస్ట్' లేదా 'భికారీ నంబర్ 1', దొంగ వంటి ట్యాగ్‌తో మార్ఫింగ్ చేయడం, మిమ్మల్ని చనిపోయినట్లు ప్రకటిస్తారన్నారు. వ్యక్తిగత, కుటుంబ సభ్యుల ఫొటోలను అశ్లీలంగా మార్చి కుటుంబ సభ్యులకు లేదా ఫోన్ కాంటాక్ట్ లిస్టులో ఉన్న నెంబర్లకు, ఇంటర్నెట్లో పెట్టి మిమ్మల్ని మానసిక ఆందోళనకు గురిచేసి మీ ప్రతిష్ఠకు భంగం కలిగించడం వంటివి చేస్తున్నారని ఎస్పీ తెలిపారు.
రుణాలు ఇచ్చే యాప్‌ల ప్రతినిధులు ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడి, వేధింపులు, బెదిరింపులకు పాల్పడితే ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా మనోధైర్యంగా వ్యవహరించి తక్షణమే పోలీసులకు సమాచారం అందజేయాలని సూచించారు. ప్రజలు, ముఖ్యంగా చదువుకుంటున్న యువత, మహిళలు ఈ ఆన్లైన్ ఇన్స్టెంట్ లోన్‌యాప్‌ల పట్ల ఆకర్షితులు కాకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ స్పష్టం చేశారు. అనధికార లోన్ యాప్‌లను ఇన్స్టాల్ చేసేటప్పుడు తమ కాంటాక్ట్స్, మీడియా, గ్యాలరీ, కెమెరాలకు సంబంధించి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వొద్దని, రుణాలు తీసుకునే విషయంలో బ్యాంకుల్ని, ప్రముఖ ఫైనాన్సింగ్ సంస్థల్ని ఆశ్రయించడమే శ్రేయస్కరమని రవీంద్ర బాబు విజ్ఞప్తి చేశారు.