ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TEMPLE : అరుదైన ఘనత...తపాలా కవర్‌పై జంట గోపురాలు - Twin Towers

తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడ కోదండరామస్వామి ఆలయ గోపురాలకు అరుదైన గుర్తింపు లభించింది. ఆలయ ప్రత్యేకత ఉట్టిపడేలా తపాలాశాఖ ప్రత్యేక కవర్ విడుదల చేయనుంది. గోపురం పేరుతో పోస్టల్ కవర్ విడుదల కావడం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తపాలా కవర్‌పై జంట గోపురాలు
తపాలా కవర్‌పై జంట గోపురాలు

By

Published : Jan 7, 2022, 5:42 AM IST

తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని కోదండ రామచంద్రమూర్తి ఆలయాన్ని 1889లో కోలలుతో ప్రతిష్ఠించారు. ఆ తర్వాత 1934లో ద్వారంపూడి సుబ్బిరెడ్డి, రామిరెడ్డి వంశీయులు... లక్ష్మణ సమేత సీతారాముల విగ్రహాలను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నిత్య పూజలు, శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 1948లో మొదటిసారి తూర్పు గోపురాన్ని నిర్మించారు. ఆరేళ్లపాటు శ్రమించి.... మెరుగులు దిద్ది తొమ్మిది అంతస్తుల్లో 160 అడుగుల ఎత్తులో తూర్పుగోపురాన్ని పూర్తి చేశారు.

1956లో ద్వారంపూడి ఆదిరెడ్డి, సీతాయమ్మ దంపతులు పశ్చిమ గోపురానికి అంకురార్పణ చేయగా ఆరేళ్లపాటు శ్రమించి 11 అంతస్తుల్లో 200 అడుగుల ఎత్తులో నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ జంట గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నాయా అనే భ్రమ కలిగిస్తూ కనువిందు చేస్తాయి. ఇంత విశిష్ఠత కలిగిన గోపురాలు దేశంలో ఎత్తైన వాటిల్లో ఒకటిగా ప్రాచుర్యం పొందాయి. గోపురాల గొప్పతనాన్ని తెలుసుకున్న తపాలాశాఖ వీటి ప్రత్యేకత ఉట్టిపడేలా పోస్టల్ కవర్‌ను విడుదల చేయాలని నిర్ణయించింది.

కోదండ రామచంద్రమూర్తి ఆలయ ప్రాంగణాన్ని ఎంతో విశాలంగా నిర్మించారు. జంట గోపురాలు ఆలయానికి మరింత వన్నెతెచ్చాయి. శిఖరాల్లో రామాయణం, భారతం, భాగవతంలోని ప్రధాన ఘట్టాలను చిత్రీకరించారు. వీటితోపాటు శిల్ప సౌందర్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. గోపురాలకు గుర్తింపు రావడం పట్ల ఆలయనిర్వాహకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తపాలా కవర్‌పై జంట గోపురాలు

పోస్టల్ కవర్ ఆవిష్కరణతో జంట గోపురాల ఘనకీర్తి దేశమంతా సుపరిచితమవ్వనుందని తపాలా శాఖ అధికారులు అంటున్నారు. గోపురాల తపాలా కవరు ఆవిష్కరణ నేడు ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇవీచదవండి.

ABOUT THE AUTHOR

...view details