గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. గంటగంటకు పెరిగిన వరద ఉద్ధృతితో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పోలవరం వద్ద వరద నీటిని కాస్త నిలువరించడంతో.. ధవళేశ్వరంపై ఒత్తిడి కాస్త తగ్గింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు ఒక్కసారిగా నదిలోకి చేరడంతో.. గోదావరికి వరదు పోటు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్‌వే మీదుగా సుమారు ఎనిమిదిన్నర లక్షల క్యూసెల వరద నీరు విడుదల చేస్తున్నారు. ఎగువ కాఫర్ డ్యాం పైభాగంలో వరద ప్రభావంతో దేవీపట్నం మండలంలో 36గిరిజన గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. పోలవరం మండలంలోని గాజులగొంది, తల్లవరం గ్రామాలను వరద తాకింది. కొండ్రుకోట నుంచి తూటిగుంట వరకు గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. పోలవరం మండలంలో 17, వేలేరుపాడులో 20, కుక్కునూరులో మండలంలో 3 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలంలో వరద ఉద్ధృతి పెరగడంతో.. రుద్రంకోట, రేపాకగొమ్ము, తిరుమలాపురం, నార్లవరం గ్రామలకు రాకపోకలు నిలిచాయి. ముంపు గ్రామాల్లోకి నీరుచేరడంతో.. నిత్యావసరాలు, ఇతర అవసరాల కోసం ప్రజలు బోట్లద్వారా గ్రామాలకు రాకపోకలు సాగిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ధవళేశ్వరం నుంచి వరద నీరు దిగువకు విడుదల చేయడంలో కోనసీమలోని వశిష్ట, వైనతేయి, గౌతమి నదీపాయల్లో వరద నీరు జోరుగా ప్రవహిస్తోంది.లంక భూములను కోసుకుంటూ గోదావరి ఉరకలేస్తోంది. ఐ.పోలవరం మండలం ఎదుర్లంక బాలయోగి వారధి వద్ద గోదావరి నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ముమ్మిడివరం మండలం గురజాపులంకలో పంట భూములు కోతకు గురయ్యాయి. గోదావరిలో భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో...తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
28న అల్పపీడనం
ఉత్తర బంగాళాఖాతం, పరిసరాల్లో ఈ నెల 28న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. దీని ప్రభావంతో.. సోమ, మంగళవారాల్లో కోస్తా, రాయలసీమల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని చెప్పారు.