మత్తుమందు(drugs) వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే.. డ్రగ్స్ కేసులో కేంద్ర, రాష్ట్రాలకూ వాటా ఉందనే అనుమానం కలుగుతోందని మాజీ ఎంపీ హర్షకుమార్(ex.MP. Harsha kumar) అన్నారు. ముంద్రా పోర్టు(mundra port) అదానీ(adhani) చేతుల్లో, కాకినాడ పోర్టు(kakinada port) విజయసాయి(vijayasai) చేతుల్లో ఉందని వ్యాఖ్యానించారు. రూ.72వేల కోట్ల హెరాయిన్ ప్రజల్లోకి వెళ్తే పట్టించుకోరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరాయిన్.. పోర్టులు దాటి వస్తే కేంద్రానికి తెలియదా? అని హర్షకుమార్ ప్రశ్నించారు.
కేంద్ర, రాష్ట్ర పెద్దలపై ఎన్ఐఏ విచారణ జరపాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. శాన్ మెరైన్ ఎండీ అలీషా(ali sha)ను ఎందుకు అరెస్టు(arrest) చేయలేదన్న హర్షకుమార్.. ద్వారంపూడికి కుడి భుజంగా ఎండీ అలీషా వ్యవహరిస్తున్నారన్నారు. డ్రగ్స్ కేసులో అరెస్టైన సుధాకర్(sudhakar).. అలీషా వద్ద పని చేస్తున్నాడని వివరించారు. డ్రగ్స్ అంశంలో సజ్జల రామకృష్ణారెడ్డి(sajjala ramakrishnareddy) అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. సజ్జల వ్యాఖ్యలు చూస్తే ప్రభుత్వానికే డ్రగ్స్‌లో భాగస్వామ్యం ఉన్నట్టుందని హర్షకుమార్ అనుమానం వ్యక్తం చేశారు.
ఏం జరిగిందంటే...
ఇటీవల గుజరాత్‌లోని ముంద్రాపోర్టులో (Mundra port drugs) పట్టుబడిన రూ.21వేల కోట్ల విలువైన 3వేల కిలోల మత్తుమందుల కేసు (Mundra Port Drugs Case) దర్యాప్తులో మరో ముందడుగు పడింది. గుజరాత్‌లో పట్టుబడిన నార్కోటిక్స్ కేసు విచారణను ఎన్‌ఐఏకు బదిలీ అయింది. ఎన్‌ఐఏ దర్యాప్తు కొనసాగించేందుకు కేంద్ర హోంశాఖ ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే డీఆర్‌ఐ నుంచి ఎన్‌ఐఏ ఈ కేసును (Mundra Port Drugs Case) స్వాధీనం చేసుకుంది. నార్కోటిక్స్ వ్యవహారంలో విదేశీ ఉగ్రవాద మూలాలు ఉన్నట్టు భావించిన కేంద్రం ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి మాదక ద్రవ్యాల దిగుమతిపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేయనుంది.
అఫ్గాన్ నుంచి ఇరాన్ మీదుగా...
గత నెల 15న ముంద్రా నౌకాశ్రయంలో పట్టుబడ్డ (Mundra Port Drugs) హెరాయిన్ వెనుక పాత్రధారి తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడికి చెందిన మాచవరం సుధాకర్ అయితే.. సూత్రధారి మాత్రం మాదకద్రవ్యాల మాఫియాలో కింగ్‌పిన్ అయిన దిల్లీ వాసేనని కేంద్ర నిఘా, దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అఫ్గానిస్థాన్ నుంచి ఇరాన్ మీదుగా విజయవాడ చిరునామాతో ఉన్న ఆషీ ట్రేడింగ్ కంపెనీకి వస్తున్న ఈ మాదకద్రవ్యాన్ని (Mundra port drugs) దిల్లీకి చేర్చాలనేది వారి వ్యూహమని గుర్తించాయి. నిఘా, దర్యాప్తు సంస్థల దృష్టిలో పడకుండా ఉండేందుకు విజయవాడ సత్యనారాయణపురం చిరునామాతో కంపెనీని ప్రారంభింపజేసి దాన్ని చీకటి కార్యకలాపాలకు వినియోగించినట్లు నిర్ధరణకొచ్చాయి.
టాల్కం పౌడర్ ముసుగులో...
ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి గ్రామానికి చెందిన మాచవరం సుధాకర్ ఇందులో పాత్రధారి అయ్యాడని, తన భార్య పేరిట ఆషీ ట్రేడింగ్ కంపెనీని రిజిస్టర్ చేయించి, దాన్ని మాదకద్రవ్యాల సరఫరా ముఠాలకు అందించాడని తేల్చాయి. ఈ ఏడాది జూన్‌లో కూడా ఈ కంపెనీ పేరుతో టాల్కం పౌడర్ ముసుగులో దాదాపు 25 టన్నుల హెరాయిన్ అఫ్గానిస్థాన్ నుంచి దిగుమతై.. కాకినాడ పోర్టు ద్వారా దిల్లీ సహా దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలిపోయినట్లు గుర్తించాయి.
దర్యాప్తు వేగవంతం...
ఈ కేసులో సుధాకర్ దంపతులతో పాటు ఎనిమిది మందిని డీఆర్‌ఐ(DRI) అరెస్టు చేసింది. వీరిలో మరో భారతీయుడు, నలుగురు అఫ్గాన్ పౌరులు, ఉజ్బెకిస్థాన్ దేశీయుడొకరు ఉన్నారు. రెండు రోజుల కస్టడీలో సుధాకర్(sudhakar) దంపతులను విచారించిన డీఆర్‌ఐ.. వారిచ్చిన సమాచారం మేరకు దిల్లీ, నొయిడా, చెన్నై, కోయంబత్తూర్, అహ్మదాబాద్, మాండ్వీ, గాంధీధామ్, విజయవాడల్లో సోదాలు చేసింది. లభించిన ఆధారాలు, నిందితుల వాంగ్మూలాన్ని బట్టి డ్రగ్స్ ముఠా మూలాలు ఛేదించేందుకు ప్రయత్నిస్తోంది. సుధాకర్‌కు కమీషన్ రూపంలో డబ్బులు ఎలా వచ్చేవి? ఈ దందాతో ఎలా పరిచయమైంది? కొరియర్ ఏజెంట్ నేపథ్యమేంటన్నది ఆరా తీసింది. చెన్నైలోని సుధాకర్ ఇల్లు, కార్యాలయంతో పాటు ఇతర చోట్ల సోదాలు చేసి నిర్ధారించుకోనుంది. గుజరాత్‌లోని డీఆర్‌ఐ తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కల్పేశ్ గోస్వామిని ‘ఈనాడు’ ప్రతినిధి ఫోన్లో సంప్రదించగా.. సుధాకర్, వైశాలి దంపతుల్ని తదుపరి దర్యాప్తు కోసం చెన్నైకి తీసుకెళ్లామని వెల్లడించారు.
అనుబంధ కథనాలు...