వ్యవసాయం అంటే భయపడే దుస్థితి నుంచి రైతులను బయటకు తీసుకురావడమే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించాలని బ్యాంకర్లను కోరారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ భేటీకి పిల్లి సుభాష్ చంద్రబోస్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పాల్గొన్నారు.
రైతులకు ఇతోధికంగా సాయం చేయాలని బ్యాంకర్లకు పిలుపునిచ్చారు. కౌలు రైతులకు న్యాయం చేయలేని పరిస్థితులను మార్చేందుకు విధివిధానాలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. రైతులతోపాటు చేనేత కార్మికులకు సైతం అండగా నిలవాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందన్నారు. స్వయం సహాయక సంఘాలకు జిల్లాలో పూర్వ వైభవం తీసుకొస్తామని సుభాష్ చంద్రబోస్ అన్నారు.