కాకినాడకు సమీపంలో గోదావరితీరాన ఉన్న కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని పర్యావరణ సున్నిత మండలంగా... కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు.... కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. 235.70 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన కోరింగ వన్యప్రాణి కేంద్రం సరిహద్దు నుంచి.... 11.5 కిలోమీటర్ల వరకు ఉన్న 187.14 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పర్యావరణపరంగా సున్నిత మండలంగా కేంద్రం ప్రకటించింది.
రెండేళ్లలో మాస్టర్ ప్లాన్ రూపకల్పన...
ఇక్కడికి రాకపోకలు సాగించే సముద్ర క్షీరదాలు, డాల్పిన్లు, ఫిషింగ్ క్యాట్స్, నక్కలు, పురాతనమైన కోతిజాతులు, ఆలివ్ రెడ్లీ తాబేళ్లు, 234 జాతుల సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నట్లు అటవీ పర్యావరణ శాఖ వెల్లడించింది. సమీప గ్రామీణులకు చేపల వేట ప్రధాన జీవనోపాధి కావడంతో.. సముద్రానికి తూర్పువైపు భాగాన్ని మినహాయించి కాకినాడ నగరం వైపు ప్రాంతాన్ని సున్నిత ప్రాంతంగా ప్రకటించింది. కేంద్రం విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్ పై రెండేళ్లలో... రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రజలతో సంప్రదించి ఎకోసెన్సిటివ్ జోన్ మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సి ఉంటుందని కేంద్ర పర్యావరణశాఖ వెల్లడించింది.