పులివెందుల పంచాయతీని జగన్ రాష్ట్రమంతా విస్తరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తెదేపాకు ఉన్న క్యాడర్ ఏ పార్టీకీ లేదన్న చంద్రబాబు... వైకాపాకు అసలు క్యాడరే లేదని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చినవాళ్లు తప్ప వైకాపాకు శ్రేణులు లేరని విమర్శించారు. తమ కార్యకర్తలపై దాడులు చేసి తిరిగి బాధితులపైనే కేసులా..? అని ప్రశ్నించారు. ఇదేమి రాజ్యం అని ప్రశ్నిస్తుంటేనే కేసులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
పోలీసులు దిగజారుతున్నారు...
పోలీసుల్లో ఇంత దిగజారుడుతనం గతంలో ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఐపీఎస్ అధికారులే ఇలా వ్యవహరిస్తే ఎలా..? అని ప్రశ్నించారు. గ్రామాల్లో నివసించే హక్కు కోసమే చలో ఆత్మకూరు కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు భద్రతతో ఆడుకుంటున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరానికి ఏమైనా జరిగితే గోదావరి జిల్లాలు ఏమవుతాయని ప్రశ్నించారు. ఈ వందరోజుల పాలన రాష్ట్రానికి ఓ శాపమని అభిప్రాయపడ్డారు. తీవ్రవాద ప్రభుత్వమని పారిశ్రామికవేత్తలు అనేలా చేశారని విమర్శించారు.
క్యాడర్‌ను గౌరవించుకుంటున్నాం...
తమ పార్టీ ఎప్పుడూ క్యాడర్‌ను గౌరవిస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు. కార్యకర్తల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకున్నామన్న చంద్రబాబు... దేశంలో తొలిసారి బీమా సౌకర్యం తీసుకొచ్చిన పార్టీ తమదేనని స్పష్టం చేశారు. రాజకీయ కక్షల బాధితుల కోసం పునరావాస నిధి ఏర్పాటు చేశామని వివరించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి రాక్షస పాలన ఎప్పుడూ చూడలేదని ధ్వజమెత్తారు. ఫ్యాక్షన్ రాజకీయాల జిల్లాల నుంచి వచ్చినవాళ్లు కూడా ఇలా ప్రవర్తించలేదన్నారు. కక్షపూరిత రాజకీయాలకు జగన్ తొలిసారి శ్రీకారం చుట్టారని ఆరోపించారు.