కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్న బహిరంగ మద్యం విక్రయాలను నిషేధించాలని ఏపీ మద్యం నియంత్రణ పోరాట సమితి నిరాహార దీక్ష చేపట్టింది. కాకినాడలోని సూర్యారావు పేట జవహర్ వీధిలోని వివేక్ భవన్లో.. సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు, ప్రధాన కార్యదర్శి హాసన్ షరీఫ్, కన్వీనర్ కాశీ బాలయ్య దీక్షలో పాల్లొన్నారు. నగర కన్వీనర్ కోయ్యా జ్యోతి దీక్షలను ప్రారంభించి కలెక్టరేట్లో వినతి పత్రాన్ని అందజేశారు.
భగవద్గీత, ఖురాన్, బైబిల్ గ్రంథాలను చేతబట్టి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగించారు. కరోనా విపత్తులో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని సంఘం పెద్దలు కోరారు. మద్యం అమ్మకాలను ఆపేవరకు తాము గాంధేయ మార్గంలో ప్రజా నిరసనలు కొనసాగిస్తామని దూసర్లపూడి రమణరాజు ప్రకటించారు. తుదిగా న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.