ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కడపలో వైఎస్ఆర్ లలిత కళల వర్శిటీ... అక్టోబర్ నుంచి తరగతులు - వైఎస్ఆర్ లలిత కళల వాస్తు శాస్త్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు

వై.ఎస్.ఆర్. ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయాన్ని కడప జిల్లాలో ఏర్పాటుచేయనున్నారు. ఈ అక్టోబరు నుంచి విద్యాసంవత్సరం ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఉపయోగపడేలా విశ్వవిద్యాలయాన్ని రూపొందించేందుకు చర్యలు చేపట్టారు. కొవిడ్ కారణంగా 2, 3 నెలలు ఆలస్యమైనా... ప్రస్తుతం విశ్వవిద్యాలయ నిర్మాణ దస్త్రాలు చకచకా కదులుతున్నాయని ఉపకులపతి తెలిపారు. ఈ నెలాఖరు నుంచే ప్రవేశాలు చేపట్టి... తాత్కాలిక భవనాల్లో విద్యాబోధన చేయాలని వర్శిటీ నిర్ణయం తీసుకుంది.

కడపలో వైఎస్ఆర్ లలిత కళల వర్శిటీ... అక్టోబర్ నుంచి తరగతులు
కడపలో వైఎస్ఆర్ లలిత కళల వర్శిటీ... అక్టోబర్ నుంచి తరగతులు

By

Published : Aug 13, 2020, 5:58 PM IST

కడపలో వైఎస్ఆర్ లలిత కళల వర్శిటీ

హైదరాబాద్ జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో ఉన్న కోర్సులన్నీ కడపలో ఏర్పాటు చేయనున్న వై.ఎస్.ఆర్. లలితకళల వాస్తుశాస్త్ర విశ్వవిద్యాలయంలో కూడా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పది కోర్సులతో తొలి విద్యాసంవత్సరం అక్టోబరు 15 నుంచి ప్రారంభించేందుకు వర్శిటీ యాజమాన్యం కసరత్తు చేస్తుంది. ఈ విశ్వవిద్యాలయంలో రెండు విభాగాల్లో పది కోర్సులు ప్రారంభిస్తున్నారు.

స్కూల్ ఆఫ్ ప్లానింగ్-ఆర్కిటెక్చర్ విభాగంలో 5 కోర్సులు ఉన్నాయి. వాటిలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సు 5 ఏళ్లు ఉంటుంది. ఇందులో రెండు సెక్షన్ల కింద 80 సీట్లు కేటాయించారు. విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు "నాటా" ( నేషనల్ అప్టిట్యూడ్ టెస్ట్ ఆర్కిటెక్షర్) ఆన్ లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తుంది.

స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ కోర్సులు కోర్సు గడువు సీట్లు ప్రవేశపరీక్ష నిర్వహణ
బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ 5 80 నాటా
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ 4 60 వర్శిటీ
బీటెక్ టౌన్ ప్లానింగ్ 4 60 ఎంసెట్
బీటెక్ ఫెసిలిటీస్-సర్వీసెస్ ప్లానింగ్ 4 60 ఎంసెట్
బీటెక్ డిజిటల్ టెక్నాలజీ 4 60 ఎంసెట్

ఈ నెల 29న ప్రవేశ పరీక్ష

కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ విభాగంలో కూడా ఐదు కోర్సులు ఉన్నాయి. ఇందులో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కింద అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, శిల్పం వంటి నాలుగు కోర్సులు నాలుగేళ్లు చొప్పున అందిస్తున్నారు. ప్రతీ కోర్సులో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. యానిమేషన్ కోర్సుకు 60 సీట్లు కేటాయించారు. నాలుగేళ్ల కోర్సుగా నిర్ధరించారు. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో చేరే విద్యార్థులకు విశ్వవిద్యాలయం నిర్వహించే ప్రవేశ పరీక్షల ద్వారానే సీట్లు కేటాయిస్తారు. కాగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్-ఆర్కిటెక్చర్ విభాగంలోని బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఐదేళ్ల కోర్సుకు ఆన్ లైన్ ప్రవేశాలను నాటా నిర్వహిస్తోంది. కోర్సులకు ఈనెల 29న ఆన్ లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆన్ లైన్ లో పేర్లు రిజిస్టర్ చేసుకోవడానికి ఈనెల 16న తుది గడువుగా నిర్ణయించారు. సెప్టెంబరు రెండోవారంలో కూడా మరోసారి నాటా ఆన్ లైన్ పరీక్ష నిర్వహించే వీలుందని వర్శిటీ యాజమాన్యం తెలిపింది. వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయ లోగోలో పది కోర్సులు ప్రతిబింబించే విధంగా రూపొందించారు.

బడ్జెట్ లో రూ. 50 కోట్లు కేటాయింపు

వై.ఎస్.ఆర్. లలితకళల వాస్తుశాస్త్ర విశ్వవిద్యాలయం శాశ్వత భవనాలు నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగు తున్నాయి. కడప శివారులోని చలమారెడ్డిపల్లె గ్రామ సమీపంలో 139 ఎకరాలను విశ్వవిద్యాలయం కోసం కేటాయించేందుకు రెవిన్యూ అధికారులు దస్త్రాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. వర్శిటీలో పరిపాలన భవనాలు, అకడమిక్ భవనాలు, క్వార్టర్స్ నిర్మించనున్నారు. ఈ మేరకు 400 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని వర్శిటీ ప్రభుత్వానికి డీపీఆర్ పంపింది. ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉన్నట్లు ఉపకులపతి విజయ కిషోర్ తెలిపారు. బడ్జెట్ లో రూ.50 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. అక్టోబరు నుంచి విద్యాసంవత్సరం ప్రారంభించేందుకు తాత్కాలిక భవనాలను అన్వేషిస్తున్నారు. ఈమేరకు కలెక్టర్ ఛైర్మన్ గా ఉన్న కమిటీ నాలుగు ప్రాంతాలను పరిశీలించారు.

తాత్కాలిక భవనాల్లో ఈ ఏడాది తరగతులు

కడప-చెన్నూరు మధ్యలో ఉన్న గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాల, యోగివేమన విశ్వవిద్యాలయం, స్విస్ట్ కళాశాల, గుడ్ బర్డ్ విద్యా సంస్థ నాలుగింటిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. వీటిలో గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలలోని రెండు భవంతులు ఖాళీగా ఉన్నాయి. ఇది దాదాపు ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగింటిలో ప్రభుత్వం ఖరారు చేసిన భవంతుల్లో తాత్కాలికంగా ఈ విద్యాసంవత్సరం ప్రారంభించనున్నారు. పది కోర్సులకు కలిపి 520 మంది విద్యార్థులను తీసుకోవాలని భావిస్తున్నారు. వీరికి బోధించేందుకు 80 సిబ్బందిని కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీరిలో 40 మంది బోధన సిబ్బంది కాగా మరో 40 మంది నాన్ టీచింగ్ స్టాఫ్. ప్రభుత్వ ఉత్తర్వులు ఈనెలాఖరులోగా వస్తాయని వర్శిటీ ఉప కులపతి విజయ్ కిషోర్ తెలిపారు.

ఫైన్ ఆర్ట్స్ కోర్సు పై ఆసక్తి కల్గిన విద్యార్థులకు వర్శిటీ అందించే విద్య ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని అధ్యాపకులు, వర్శిటీ యాజమాన్యం భావిస్తున్నారు.

ఇదీ చదవండి:

మావోయిస్టులే గంజాయి వ్యాపారస్థులు.... మన్యంలో గోడ పత్రిక కలకలం

ABOUT THE AUTHOR

...view details