కడప జిల్లా ముద్దనూరు మండలం నల్లబెల్లి సమీపంలోని గాలేరు - నగరి కాలవలో దూకి యువతీ, యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిని అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం మర్రికమ్మాడిన్నె గ్రామానికి చెందిన యువతీ, యువకులుగా పోలీసులు గుర్తించారు. ముదునూరు ఎస్ఐ శివప్రసాద్ చెప్పిన ప్రకారం... మృతురాలు కవిత (25) భర్త.. కొన్నేళ్లుగా కువైట్‌లో ఉంటున్నాడు. కవిత గ్రామ వాలంటీర్‌గా పని చేశారు. అదే గ్రామానికి చెందిన కార్తీక్ (26) వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తున్నారు. కొంతకాలంగా ఇరువురూ సన్నిహితంగా ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కార్తీక్‌కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.
తనకు ఇష్టం లేకున్నా పెళ్లి సంబంధాలు చూస్తున్నారని కడప జిల్లా పులివెందులలోని బంధువుల వద్ద మొర పెట్టుకున్నట్లు చెప్పారు. ఈనెల 14వ తేదీ ప్రేమ జంట పులివెందులకు చేరుకుంది. అదే రోజు సాయంత్రం ముదునూరు సమీపంలోని నల్లబెల్లి వద్ద గాలేరు - నగరి కాలువలో దూకి ఇరువురు ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం రెండు మృతదేహాలు తేలడాన్ని గుర్తించి.. స్థానికుల సహాయంతో ఇద్దర్నీ బయటికి తీసినట్లు చెప్పారు. కార్తీక్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.