కడప జిల్లాలో 151 కిలోమీటర్ల పొడవునా పెన్నానది ప్రవహిస్తోంది. నాలుగు దశాబ్దాల కిందట మైలవరం వద్ద నదిపై 9.965 టీఎంసీల సామర్థ్యంతో జలాశయం నిర్మించారు. అనంతరం గండికోట జలాశయ నిర్మాణాన్ని 26.85 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో చేపట్టారు. బ్రిటిష్ కాలంలో వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె వద్ద ఆనకట్టను నిర్మించారు. ఇక్కడనుంచే కర్నూలు-కడప కాలువ ద్వారా ఆయకట్టుకు నీటిని మళ్లిస్తున్నారు. ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట దిగువన జిల్లాలో ఎలాంటి జలాశయాలు, ఆనకట్టలు నిర్మించలేదు. వచ్చిన నీరు వచ్చినట్లే పొరుగున ఉన్న నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయంలోకి చేరుతోంది.
తూర్పు వైపునకు 941.98 టీఎంసీలు
2009 నుంచి 2020 సెప్టెంబరు 24వ తేదీ వరకు పుష్కర కాలంలో 941.98 టీఎంసీలు జిల్లాకు దక్కకుండా తూర్పు దిశకు వెళ్లిపోయాయి. జిల్లాలో గాలేరు-నగరి సుజల స్రవంతి, తెలుగు గంగ, హంద్రీనీవా పథకాలతోపాటు గండికోట ఎత్తిపోతల, జీకే-సీబీఆర్ పథకాల నిర్మాణానికి రూ.కోట్లు ఖర్చు చేశారు. భవిష్యత్తులో నీటి అవసరాల దృష్ట్యా వీటిని మరింత విస్తరించాలని ఇటీవల రాష్ట్ర ఉన్నతాధికారులు అనుమతిచ్చారు. శ్రీశైలం నుంచి కృష్ణాజలాలు తీసుకొచ్చేందుకు భారీ ప్రణాళికను రూపొందించి ఆ దిశగా ముందడుగు వేశారు. అదే కరవు సీమ నుంచి గలగల పరవళ్లు తొక్కుతూ జారిపోతున్నా నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై మాత్రం దృష్టి సారించడం లేదు. ఒంటిమిట్ట చెరువులోకి సోమశిల వెనుక జలాలను తరలించేందుకు శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ఇది గత నాలుగేళ్లుగా పూర్తి స్థాయిలో ఎన్నడూ కూడా ఎత్తిపోయలేదు.
● నందలూరు మండలం చింతలకుంట, ఎర్రచెరువుపల్లి, రామనపల్లి, లేబాక చెరువులకు వెనుక జలాలను తరలించి 0.593 టీఎంసీలు నిల్వ చేయాలని ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదనలు పంపారు. ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదు.
● ఒంటిమిట్ట మండలం మదిలేగడ్డ దిగువన పెన్నానదిపై ఆనకట్టను నిర్మించాలని అన్నమయ్య డివిజన్ సాంకేతిక నిపుణులు ప్రతిపాదించారు. ఇందుకోసం రూ.96 కోట్లు అవసరమని గుర్తించారు. ఇది పూర్తయితే 18.23 టీంఎసీలను నిల్వ చేయొచ్ఛు
● బద్వేలు నియోజకవర్గంలోని కరవు ప్రాంతాలకు సోమశిల నీటిని తరలించాలని కొన్నేళ్లుగా ప్రయత్నం జరుగుతోంది. ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు కొలిక్కి రాలేదు.