మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డితో తన కుమారుడు సునీల్ యాదవ్ సన్నిహితంగా మెలిగింది నిజమేనని సునీల్ తండ్రి కృష్ణయ్య తెలిపారు. వివేకా తమ ఇంటికి రెండు సార్లు వచ్చారన్న కృష్ణయ్య.. ఆయన్ను సునీల్ యాదవ్ హత్య చేశాడన్నది మాత్రం అవాస్తవమేనని స్పష్టం చేశారు. రెండున్నర ఏళ్లుగా ఏమీ మాట్లాడని రంగయ్య ఇప్పుడే ఎందుకు నోరు విప్పాడని అనుమానం వ్యక్తం చేశారు. రంగయ్య ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని తేల్చి చెప్పారు. తన కుమారుడి ప్రమేయం లేకపోయినా సీబీఐ అధికారులు కావాలనే కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా సునీల్ ఉన్నాడు.
'కావాలనే ఇరికించారు..'
రెండేళ్ల నుంచి పోలీసులు, సీబీఐ అధికారులు తమ కుటుంబాన్ని చిత్ర హింసలు పెడుతున్నారని సునీల్ కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. సునీల్‌ను సీబీఐ అధికారులు తీవ్రంగా కొట్టినట్లు ఆరోపిస్తూ.. అందుకు సంబంధించిన ఫొటోలను మీడియాకు చూపించారు. హత్య చేసినట్టు అంగీకరించాలని సునీల్ స్నేహితుడు ఒత్తిడి చేయటంతో గత్యంతరం లేక గోవా పారిపోయాడన్నారు. వైఎస్ కుటుంబం అంటే తమకు ఎనలేని గౌరవం ఉందని.. కొందరు వ్యక్తులు కావాలనే తమ కుమారుడిని ఇరికిస్తున్నారని సావిత్రి వాపోయారు. దస్తగిరి, ఉమా శంకర్ ద్వారానే సునీల్‌కు వివేకానందరెడ్డి పరిచయం అయ్యారు కానీ.. హత్య కేసుతో సంబంధం లేదన్నారు. వివేకాను హత్య చేసిందెవరో సీబీఐకి తెలుసని సునీల్ భార్య లక్ష్మి ఆరోపించారు.
గోవాలో అరెస్టు..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈనెల 2న గోవాలో సునీల్ యాదవ్‌ను అరెస్ట్ చేసినట్లు సీబీఐ ధృవీకరించింది. ఈ నెల 3న సునీల్‌ను గోవా స్థానిక కోర్టులో హాజరు పరిచిన సీబీఐ అధికారులు ట్రాన్సిట్ రిమాండ్‌లోకి తీసుకున్నారు.