Students Protest: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు కదం తొక్కారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. జీవో 35, 77 రద్దు సహా పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చేవరకూ పోరాటం చేస్తామని విద్యార్థులు తేల్చిచెప్పారు.
సుమారు 1900 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు ఆందోళన చేశారు. జీవో నెంబర్ 35,77లను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు తమ సమస్యలకు తక్షణం పరిష్కారం చూపాలంటూ కలెక్టరేట్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.