ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యోగి వేమన ఉద్యానవనం... అరుదైన వృక్షజాతులకు నిలయం..! - latest news on botanical garden

అది కరవు ప్రాంతమైన రాయలసీమ.. అదీ వర్షాభావ పరిస్థితులున్న కడప జిల్లా.. ఆ ప్రాంతంలో మొక్కలు ఏపుగా పెంచడం ఎంతో కష్టమైన పనే... అలాంటిది కడప యోగివేమన విశ్వవిద్యాలయం వృక్ష శాస్త్ర ఉద్యానవనంలో సిబ్బంది ఎన్నో వేల మొక్కలను పిల్లల్లా పెంచుతున్నారు. వాననీటిని ఒడిసి పట్టి...ఉన్న నీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎన్నో అవార్డులు సొంతం చేసుకుని రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోందీ ఉద్యానవనం.

story on yogi vemana university botanical garden
యోగివేమన విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర ఉద్యానవనంపై కథనం

By

Published : Dec 14, 2019, 9:02 AM IST

అరుదైన వృక్షజాతులకు నిలయంగా మారిన యోగి వేమన విద్యాలయం
కడప యోగివేమన విశ్వవిద్యాలయం ఆవరణంలోని బొటానికల్ గార్డెన్‌లోకి అడుగు పెట్టగానే... స్వచ్ఛమైన గాలి, పచ్చని చెట్లు స్వాగతం పలుకుతాయి. బయట పెద్దగా కనిపించని ఎన్నో అరుదైన, అందమైన మొక్కలు, చెట్లు ఇక్కడ దర్శనమిస్తాయి. యోగివేమన విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర ఉద్యానవనం 2009లో ఏర్పాటు చేశారు. 20 ఎకరాల విస్తీర్ణంలో గార్డెన్ రూపుదిద్దుకుంది. ఇక్కడ దాదాపు 2 వేల రకాలకు చెందిన 7 వేల మొక్కలు ఉన్నాయి. 200 రకాల ఔషధ మొక్కలు, 150 రకాల వృక్షాలు, 30 రకాల అంతరించి పోయే మొక్కలు కనిపిస్తాయి. పచ్చని మొక్కలతో అలరారుతూ ప్రకృతి రమణీయతకు ఈ ఉద్యానవనం నిలువుటద్దంలా నిలుస్తోంది.

ప్రతికూల పరిస్థితుల్లోనూ సంరక్షణ

తూర్పు కనుమలు, శేషాచలం అడవులు, కడప, కర్నూలు జిల్లాల్లోనే పెరిగే అరుదైన మొక్కలు ఇక్కడ పెంచుతున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ మొక్కలు సంరక్షిస్తున్నారు ఉద్యాన వన నిర్వాహకులు. ఎక్కువగా అటవీ ప్రాంతంలో పెరిగే మొక్కలను పెంచుతున్నారు. మొక్కలు, చెట్లకు కావాల్సిన నీటి వసతిని...బిందు, తుంపర, రెయిన్ గన్ ద్వారా అందిస్తున్నారు.

అరుదైన జాతుల పెంపకం

బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించిన 15 రకాల అంతరించిపోతున్న మొక్కలను ఇక్కడ సంరక్షిస్తున్నారు. అరుదైన వృక్ష జాతులను కాపాడేందుకు వాటి విత్తనాలను ఆయా ప్రాంతాల్లో సేకరించి వాటిని శుద్ధిచేసి పెంచుతున్నారు. మొక్కలుగా పెరిగిన తర్వాత వాటిని తిరిగి తూర్పు కనుమలతో పాటు ఎక్కడైతే పెరుగుతాయో అక్కడికి తీసుకెళ్లి నాటుతున్నారు. కడప జిల్లాలోనే పెరిగే అరుదైన బ్రాకీ స్టెల్మా వేమన అనే మొక్కను సేకరించి పెంచడం వల్ల ఈ ఉద్యానవనానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అంతరించి పోతున్న మొక్కలను కాపాడినందుకుగానూ... 2017-18 ఏపీ గ్రీన్ అవార్డును ఈ బొటానికల్ గార్డెన్ సొంతం చేసుకుంది. మొక్కలను బాగా సంరక్షించినందుకు గానూ.. వ్యక్తిగతంగా ఉత్తమ మొక్కల సంరక్షకుడి అవార్డు కింద కడప యోగివేమన విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర అధ్యాపకుడు మధుసూదన్ రెడ్డికి 2019లో అవార్డు లభించింది.

ఇదీ చదవండి:

'ప్లాస్టిక్​పై వేటేద్దాం.. విస్తరాకుకే ఓటేద్దాం!'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details