బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావతంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. కడప(rains in kadapa)లో రాత్రి నుంచి చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ తెల్లవారుజాము నుంచి ఓ మోస్తరుగా వర్షం పడుతోంది. దీంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కడప జిల్లా పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. కడప నగరంలో ప్రవహిస్తున్న బుగ్గవంక ఇరువైపులా ఇసుక బస్తాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో వాగులు, వంకలు ఉన్నచోట బందోబస్తు ఏర్పాటు చేశారు. కుప్పంలో కుండపోతగా కురుస్తున్న వర్షానికి ప్రచారం అగిపోయింది. రైల్వేకోడూరు నియోజకవర్గంలో రైల్వేకోడూరులో ప్రధాన రహదారి వర్షపు నీళ్లతో నిండిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ప్రకాశం జిల్లాలో..
ప్రకాశం జిల్లాలో జోరువానల(heavy rains at prakasam district)తో అమరావతి రైతులు కొంత ఇబ్బందిపడ్డారు. మహాపాదయత్రలో భాగంగా నాగులుప్పలపాడులో రైతులు రాత్రి బస చేయగా.. ఒక్కసారిగా కురిసిన వర్షానికి టెంట్ల నుంచి నీరు కారి మంచాలు మొత్తం తడిచిపోయాయి. పరుపులు, దుప్పట్లు తడిచిపోవడంతో చలిగాలులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అర్థరాత్రి నుంచి మెలకువగానే ఉండిపోయారు. ఇలాంటి ఎన్ని కష్టాలు ఎదురైనా తమ సంకల్పాన్ని వీడేది లేదని....రైతులు తెలిపారు. తిరుపతికి మహాపాదయత్ర కొనసాగించి తీరుతామన్నారు.
నెల్లురులో పాఠశాలలకు సెలవు..
నెల్లూరు జిల్లా(heavy rains in nellore district)లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఈదురు చలి గాలుల వీస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. గంటగంటకు గాలుల వేగం పెరగడంతో చలి తీవ్రత ఎక్కువ కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. నెల్లూరు నగరంలో లోతట్టు ప్రాంతాలల్లోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంకటగిరి పట్టణంలోని సవారిగుంట,ఎన్టీఆర్ కాలనీ, మార్కెట్ వీధుల్లోని లోతట్టు ఇళ్లలోకి వర్షం నీరు చేరడంతో ఆయా కుటుంబీకులు ఇక్కట్లు పడుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని చెరువులకు జల కళ సంతరించుకుంది. రాపూరు మండలంలోనూ బుధవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. నాయుడుపేట, సూళ్లూరుపేట, శ్రీ హరికోట పరిసర ప్రాంతం, తడలో రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. జిల్లా యంత్రాంగం.. ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమైందని స్థానికులు విమర్శలు చేస్తున్నారు. ఆత్మకూరు డివిజన్ పరిధిలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.
ఉప్పొంగిన స్వర్ణముఖి నది..
విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున్న చిత్తూరు(heavy rains at chittoor district) జిల్లాలోని విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. తిరుమలలో ఈదురుగాలులతో ఎడతెరిపి లేని వర్షాలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ ఈదురుగాలులతో రోడ్డుపై చెట్లు విరిగిపడ్డాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. స్వర్ణముఖి నదికి పెద్ద ఎత్తున వరద ప్రవాహం పెరిగింది. దీంతో సదాశివ పురం - ఏర్పేడు ప్రధాన రహదారిపై మోదుగులపాలెం సమీపంలో స్వర్ణముఖి నది కాజ్ వే పై, పాపా నాయుడుపేట- గుడిమల్లం ప్రధాన రహదారిపై సీత కాలవలో భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ఆ మార్గంలో వాహన రాకపోకలను అధికారులు నిషేధించారు.
కేవీబీపురం మండలం కాళంగి రిజర్వాయర్ 10 గేట్లును ఎత్తి 1200 క్యూ సెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. దీంతో అంజూరు పాల్యంలోని పలు ఇళ్లల్లోకి నీరు చేరింది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శ్రీరంగరాజపురం మండలంలో పాతపాళ్యం, పాపిరెడ్డి పల్లె వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చంద్రగిరి మండల పరిధిలో రామిరెడ్డి పల్లి, మామిడిమానుగడ్డ, కొటాల, పులిత్తివారి పల్లెలో రోడ్లు కోతకు గురికావడంతో పలు గ్రామాలకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. భీమవరం నుంచి కొత్తపేట రహదారి కొట్టుకుపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కళ్యాణి డ్యామ్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.