కడప జిల్లాకు చెందిన కొంత మంది నాయకులు సర్పంచులుగా ఉత్తమ సేవలందించి మన్ననలు పొందారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రిగా ఉన్నత స్థానాలకు చేరుకుని పల్లె మనసు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. స్థానిక పోరులో ప్రజల మద్దతుతో గ్రామ పంచాయతీ సర్పంచులుగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. పల్లెసీమ నుంచి చట్టసభల్లోకి ప్రవేశించి ఎన్నో పదవులు అలంకరించి అభివృద్ధిలో తమదైన ముద్ర వేశారు.
రామసుబ్బారెడ్డి....
1984లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పి.రామసుబ్బారెడ్డి 1994, 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. 1986లో పెద్దముడియం మండలం గుండ్లకుంట సర్పంచిగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1994, 1999లో చదిపిరాళ్ల నారాయణరెడ్డిపై జమ్మలమడుగు నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా గెలిచారు. 1994లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో అటవీశాఖ మంత్రిగా, 1999లో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో గృహనిర్మాణశాఖ మంత్రిగా సేవలందించారు. 2017 జులైలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ప్రస్తుతం వైకాపాలో కొనసాగుతున్నారు.
రాయచోటి మాజీ ఎమ్మెల్యే దివంగత మండిపల్లె నాగిరెడ్డి రాయచోటి సమితి అధ్యక్షుడిగా 1981లో గెలుపొందారు. రాయచోటి శాసనసభ్యుడిగా 1985 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ దాదాసాహెబ్‌పై (తెదేపా) గెలిచారు. 1990 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా జంపాల కొండ్రాయుడుపై విజయం సాధించారు.
- రాయచోటి మాజీ ఎమ్మెల్యే ఎస్.హబీబుల్లా తొలుత 1967లో సర్పంచిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1972 జరిగిన ఎన్నికల్లో రాయచోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎం.నరసింహారెడ్డి (స్వతంత్ర)పై విజయం సాధించారు. రాయచోటి రెస్కో ఛైర్మన్‌గా కూడా సేవలందించారు.
- లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డి సర్పంచిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. రామాపురం మండలం సుద్దమళ్ల సర్పంచిగా 1971 నుంచి 1981 వరకు పనిచేశారు. 1989 శాసనసభ ఎన్నికల్లో లక్కిరెడ్డపల్లె స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి ఆర్.రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్)పై విజయం సాధించారు.
- లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే జి.రామసుబ్బారెడ్డి సర్పంచిగా తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 1965 నుంచి 1971 వరకు రామాపురం మండలం సుద్దమళ్ల సర్పంచిగా ఏకగీవ్రంగా ఎంపికయ్యారు. అనంతరం లక్కిరెడ్డిపల్లె స్థానానికి 1978లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి జనతా అభ్యర్థి ఆర్.రాజగోపాల్‌రెడ్డిపై విజయం సాధించారు.
- డాక్టర్ ఎం.వి.మైసూరారెడ్డి సమితి అధ్యక్షుడిగా గెలుపొంది అనంతరం అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశారు. 1981లో కమలాపురం సమితి అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన 1985లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఆర్.సీతారామయ్యను (తెదేపా) ఓడించారు. 1989, 1999 ఎన్నికల్లో వెంకటరెడ్డి (తెదేపా), వీరశివారెడ్డి (తెదేపా)లపై గెలుపొందారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో హోంశాఖ మంత్రిగా పనిచేశారు. కడప పార్లమెంటు స్థానానికి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
జిల్లాలోని ముఖ్య నాయకుల్లో దివంగత నేత పొన్నపురెడ్డి శివారెడ్డి ఒకరు. ఈయన రాజకీయ ప్రస్థానం సమితి అధ్యక్షుడిగా మొదలైంది. అనంతరం పెద్దముడియం మండలం గుండ్లకుంట సర్పంచిగా పనిచేశారు. జమ్మలమడుగు ఎమ్మెల్యేగా, ఎన్టీఆర్ మంత్రివర్గంలో కార్మికశాఖ మంత్రిగా సేవలందించారు. 1983లో తాతిరెడ్డి నరసింహారెడ్డిపై స్వతంత్ర అభ్యర్థిగా, 1985లో కుండా పెద్దచౌడప్ప, 1989లో మైఖేల్ విజయ్‌కుమార్‌పై తెదేపా అభ్యర్థిగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.
ఇదీ చదవండి
ఎంత మంచోడినో.. అంత దుర్మార్గుడిని!