ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వివిధ జిల్లాల్లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు - sankranthi celebration in east godavari

రాష్ట్రంలోని పలు జిల్లాలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకున్నారు. పిండివంటలు,ముగ్గులు,గొబ్బెమ్మలు ఏర్పాటు చేశారు. భోగిమంటల చుట్టూ తిరుగుతూ... సందడి చేశారు.

వివిధ జిల్లాల్లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
వివిధ జిల్లాల్లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

By

Published : Jan 10, 2020, 11:57 PM IST

అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

తూర్పుగోదావరి,విశాఖ,కడప,శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ముందస్తు సంక్రాంతి సంబరాలు చేశారు.

రంపచోడవరంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిపారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఐటీడీఏ ఉద్యోగులతో పాటుగా డ్వాక్రా మహిళలకు ముగ్గులపోటీలు నిర్వహించారు. ఐటీడీఏ పీవో నిశాంత్ కుమార్ దంపతలు, ఐటీడీఏ డీడీ సరస్వతి, ఈఈ రమాదేవి, ఏటీడబ్ల్యూవో సుజాత తదితరులు పరిశీలించి విజేతలకు బహుమతులు అందచేశారు.

కొత్తపేటలో ఆకట్టుకున్న విద్యార్థుల వస్త్రధారణ

కొత్తపేట నియోజక వర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ వేషధారణలో సంబరాల్లో పాల్గొన్నారు. రావులపాలెంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని... భోగి మంటలను వెలిగించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

భోగిమంట చుట్టూ... ఆడుతూ... పాడుతూ వేడుకలు

విశాఖ జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ముందస్తు సంక్రాంతి పండుగను జరిపారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి... గాలి పటాలు ఎగురవేశారు. బాలికలు భోగీ మంట చుట్టూ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. సోదెమ్మ, ఆర్భాటాల కబుర్లు చెప్పే కొమ్మదాసులోడు, గంగిరెద్దులు సందడి చేశాయి. పిండి వంటలు తయారుచేసి పంచారు. చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ కర్రాబిళ్లా ఆట ఆడి ఆనందంగా పిల్లలతో గడిపారు.

ఆకట్టుకున్న కోలాటం

కడప జిల్లా రాజంపేటలోని శ్రీ సాయి విద్యాలయంలో సంక్రాంతి పండుగ మూడు రోజులు ముందే వచ్చినట్లుగా జరుపుకున్నారు. పిల్లలు కోలాటం ముత్యాలతో అలరించారు. జంగమయ్య హరిదాసు వేషధారణలో ఆకట్టుకున్నారు. భోగిమంటలు వేసి మంట చుట్టూ సందడి చేశారు. టీచర్లు గొబ్బిళ్ళు పాటలకు అడుగులు వేశారు.పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ బాలరాజు, ప్రధానోపాధ్యాయురాలు రేణుక దేవి పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు.

ఘనంగా ముగ్గుల పోటీలు

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. సంక్రాంతి వైభవాన్ని చాటిచెప్పేలా భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, పొంగలి తయారీ, ముగ్గులు, గొబ్బెమ్మలు ఏర్పాటు చేశారు. భోగిమంటల్లో పిడకలు వేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.విద్యార్థినుల కోలాటం అందర్ని ఆకట్టుకుంది. సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో రంగవల్లికల పోటీలు నిర్వహించారు

ఇవీ చదవండి

కోనసీమలో ముందుగానే సంక్రాంతి సంబరాలు..!


ABOUT THE AUTHOR

...view details