రాజంపేటలో అసమ్మతి గాలి
ఒకరిదేమో టిక్కెట్ రాలేదని అలక... మరొకరిది మళ్లీ ఎమ్మెల్యేగా గెలవటమే లక్ష్యం. ఇద్దరి నేతలది ఒకే పార్టీ... కానీ సఖ్యత లేదు. అధిష్ఠానం రంగప్రవేశంతో ఒక్కటయ్యారు. నేతలు కలిసినా...కార్యకర్తల్లో అంతరం ఇంకా తగ్గలేదు. ఇప్పుడు అదే వైకాపా అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది.
రాజంపేటలో అసమ్మతి గాలి
మేడా మల్లిఖార్జున రెడ్డి... కడప జిల్లాలో తెదేపా నుంచి నుంచి గెలిచిన ఏకైక అభ్యర్థి. తాజాగా సైకిల్ దిగి వైకాపా గూటికి చేరిన మేడాకు క్షేత్రస్థాయిలో తలనొప్పులు తప్పటం లేదు. కిందటి ఎన్నికల్లో ఆయనపై వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన అమర్నాథ్ రెడ్డి నెలరోజులగా అలకపాన్పు ఎక్కారు. రంగంలోకి దిగిన వైకాపా అధిష్ఠానం రాజీ కుదిర్చింది. జగన్ సూచనతో ఇద్దరూ కలిసినా... శ్రేణుల నుంచి వ్యతిరేక గళం వినిపిస్తోంది.
కడప జిల్లా రాజంపేట మాజీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి జనవరి 31ను తెదేపాను వీడి వైకాపాలో చేరారు. ఈయన చేరికపై రాజంపేట టిక్కెట్ ఆశిస్తున్న వైకాపా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ జోక్యంతో మనసు మార్చుకున్నారు. రాజంపేట మాజీ ఎంపీ మిథున్ రెడ్డి ఇద్దర్నీ కలిపి సమావేశాలు నిర్వహించారు. పార్టీ కోసం ఐక్యంగా పనిచేయాలని సూచించారు. సిద్ధవటంలో నిర్వహించిన సమావేశంలో వైకాపా నేతలకు చుక్కెదురైంది. మేడా వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అమర్నాథ్ రెడ్డి అనుచరులు ఆందోళన చేశారు. తమ పరిస్థితేంటని ప్రశ్నించారు. వాళ్లను మిథున్ రెడ్డి, మేడా, ఆకేపాటి శాంతింపజేశారు. అందర్నీ కలుపుకొని వెళ్తామని... ఎవ్వరికీ అన్యాయం జరగదని తేల్చి చెప్పారు.
చిన్నచిన్న మనస్పర్థలు తొలగించి కలిసి ఉన్నామనే భావన బలంగా తీసుకెళ్లేందుకు మేడా,ఆకేపాటి చర్యలు ముమ్మరం చేస్తున్నారు. నియోజకవర్గంలోని మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు లక్షల చీరలు సిద్ధం చేసిననట్టు సమాచారం.
Last Updated : Feb 17, 2019, 5:07 PM IST