కడప జిల్లా రాయచోటి మండలంలో కొండపై గుహలో ముగ్గురు పిల్లలు చిక్కుకుపోయారు. వడ్డేపల్లికి చెందిన గిరిబాబు, సురేశ్‌బాబు, రెడ్డిబాబులు సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలోని వండాడి కొండపైకి సరదాగా ఎక్కారు. అక్కడ తప్పిపోయి దిగేందుకు దారి తెలియక రాలేకపోయారు. రాత్రి వరకు పిల్లలు ఇంటికి రాకపోవడం వల్ల తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. గ్రామం చుట్టుపక్కల గాలించినా వారి ఆచూకీ లభించలేదు.
కొండపై గుహలో గుర్తింపు
రాత్రి సమయంలో కొండ పైనుంచి కేకలు వినిపించడం వల్ల అడవిలో పిల్లలు చిక్కుకున్నారని గుర్తించిన గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. పెద్ద కొండ కావడం వల్ల వారిని గుర్తించలేకపోయారు. సమాచారం అందుకున్న రాయచోటి పోలీసులు అక్కడికి చేరుకుని పిల్లల కోసం గాలించాయి. సీఐ రాజు ఆధ్వర్యంలో మూడు బృందాలు కొండపై గాలింపు చేపట్టాయి. రెండు గంటలపాటు శ్రమించి పిల్లలు గుహలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారు సురక్షితంగా ఉన్నట్లు తెలుసుకొని గ్రామస్థులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.