హోంగార్డుల ఎంపిక పేరుతో ఓ నకిలీ జాబితాను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు కడప జిల్లా అదనపు ఎస్పీ దేవ ప్రసాద్ వెల్లడించారు. జిల్లాలో గత ఏడాది 75 సాంకేతిక హోంగార్డుల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యర్థులందరికీ నైపుణ్య పరీక్షలు సైతం నిర్వహించామన్నారు. అధికారికంగా ఎంపికైన హోంగార్డుల జాబితాను ఇంకా విడుదల చేయలేదని అదనపు ఎస్పీ స్పష్టం చేశారు.
కానీ.. కొంతమంది ఆకతాయిలు హోంగార్డుల ఎంపిక జాబితా పేరుతో ఫేక్ లిస్ట్ ను సామాజిక మాధ్యమాల్లో పెట్టినట్లు రెండు రోజుల కిందట గుర్తించామని తెలిపారు. ఈ మేరకు వారిపై కడప ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. హోం గార్డ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా చెబితే వారి మాటలు నమ్మవద్దని సూచించారు. అలాంటి వ్యక్తులు తారసపడితే.. వారి వివరాలను పోలీసులకు అందించి ఫిర్యాదు చేయాలన్నారు.