Fake documents: వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఇది వరకే పలు భూకుంభకోణాలు వెలుగులోకి రాగా... తాజాగా మరొకటి బయటపడింది. అధికారపార్టీ పేరు చెప్పుకొని ఓ సాధారణ వ్యక్తి సైతం సుమారు వంద ఎకరాల ప్రభుత్వ భూములను తన కుటుంబ సభ్యుల పేరిట అక్రమంగా నమోదు చేయించుకున్నారు. అందులో కొంత విక్రయించేశారు. స్థానికంగా అనుమానం తలెత్తకుండా తెలంగాణలోని బంధువుల పేరిట కూడా భూముల్ని నమోదు చేయించారు. భవిష్యత్తులో ఎలాంటి ఆటంకం కలగకుండా వివిధ రూపాల్లో నకిలీ పత్రాలను సృష్టించి పలువురి పేర్ల ద్వారా బదలాయించినట్లుగా రిజిస్ట్రేషన్ ద్వారా సైతం సొంతం చేసుకున్నారు.
కాశినాయన మండలం ఇటికులపాడు గ్రామానికి చెందిన సర్వే నంబరు 154, 272/1, 272/3, 279/1, 279/5, 301/2, 388లో సుమారు వంద ఎకరాల సర్కారు భూములను అనువంశికం పేరిట సక్రమించినట్లుగా కుటుంబ సభ్యుల పేరిట అక్రమంగా బదలాయించుకున్నారు. ఇందుకు రెవెన్యూ యంత్రాంగం సహాయ సహకారాలు అందించడంతో వ్యవహారం అంతా సక్రమమైపోయింది. నాయునిపల్లె గ్రామంలోని సర్వే నంబరు 204/2 కింద 24.28 సెంట్ల ప్రభుత్వ భూమిని అక్రమ రికార్డుల పరంగా కాజేశారు.