Somasila dam back water in kadapa : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెన్నానది ఉద్ధృతంగా ప్రవహించింది. ఆ నీరంతా నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టుకు చేరింది. సోమశిల జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరడంతో ప్రాజెక్టు వెనక జలాలు కడప జిల్లాలోని గ్రామాలను చుట్టుముట్టాయి. ఒంటిమిట్ట, సిద్ధవటం, అట్లూరు, పెనగలూరు, గోపవరం మండలాల్లోని 105 గ్రామాలు ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో దుర్వాసనతో పాటు విషపురుగులు వస్తున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు.
నిలిచిన రాకపోకలు...
గంగపేరూరు, పెన్నపేరూరు గ్రామాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. పెన్నపేరూరు-వెంకటాయపల్లె రహదారి పైకి నీళ్లు రావడంతో రాకపోకలు నిలిచి పోయాయి. అట్లూరు మండలంలో సగిలేరుపై నిర్మించిన వంతెన సోమశిల వెనకజలాలతో నీటమునిగింది. ముత్తుకూరు, వేమలూరు, కామసముద్రం, మాడపూరు, మన్నెంవారిపల్లె, కమలకూరు గ్రామస్థులు మండల కేంద్రం అట్లూరుకు రావాలంటే చుట్టూ 45 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తోంది.