ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆలయ భూమి అప్పగింతకు చౌక బేరం.. ఈ ధరతోనే ప్రత్యామ్నాయం..! - వైఎస్సార్​ జిల్లాలో ఆలయ భూమి అప్పగింతకు చౌక బేరం

Temple land: ఆలయ భూమి అప్పగింతకు చౌక బేరం సాగుతోంది. మార్కెట్‌ విలువ ఎకరా రూ.కోటి ఉంటే.. అధికారులు వేసింది రూ.3.30 లక్షలే. ఆక్రమణదారులకు మేలు చేసేందుకు వీలుగా.. అధికారులు ఆ ఆలయానికి ప్రత్యామ్నాయ భూమిని ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇది సీఎం సొంత నియోజకవర్గంలో జరుగుతున్న తంతు.

Temple land
ఆలయ భూమి

By

Published : Jul 30, 2022, 7:47 AM IST

Temple land: అక్కడ ఆలయ భూమిని ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారు. ఇపుడు దాని విలువ ఎక్కువగా ఉంది. ఆక్రమణదారులకు మేలు చేసేందుకు వీలుగా.. అధికారులు ఆ ఆలయానికి ప్రత్యామ్నాయ భూమిని ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇందుకు కబ్జాలో ఉన్న భూమి విలువను అతి తక్కువగా చూపించారు. ఇది వైయస్‌ఆర్‌ జిల్లాలోని సీఎం జగన్‌ సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని వేంపల్లికి దగ్గరలోని కత్తులూరులో ఉన్న గంగమ్మ దేవస్థానం భూముల విషయంలో జరుగుతున్న తంతు. ఈ ఆలయానికి నందిపల్లిలోని కడప-పులివెందుల 4 వరుసల రహదారికి ఇరువైపులా కలిపి సర్వే నంబరు 514, 540లలో ప్రస్తుతం 9.63 ఎకరాలు ఉంది. ఇది వేంపల్లి మండల కేంద్రానికి సమీపంలో ఉండటం, ప్రధాన రహదారికి ఆనుకుని ఉండటంతో.. ప్రస్తుతం ఇక్కడ ఎకరా మార్కెట్‌ విలువ రూ.కోటి వరకు ఉంటుందని చెబుతున్నారు. అయితే అధికారులు దీనికి అతి తక్కువ విలువ కట్టారు.

ప్రత్యామ్నాయ భూమి ఎంపిక కోసం:మొత్తం భూమిలో 5.19 ఎకరాలను 30 మందికిపైగా ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారు. పునాదులు, పశువుల కొట్టాలున్నాయి. భూములను ఖాళీ చేయాలంటూ దేవాదాయశాఖ అధికారులు గతంలో నోటీసులు ఇచ్చారు. దీనిపై దాదాపు 30 మంది దేవాదాయ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఇందులో ఆరుగురిని ఖాళీ చేయించాలని ఆదేశాలొచ్చాయి. మరోవైపు వీరికి వేలం ద్వారా ఆ భూములను విక్రయించాలంటూ అక్కడి ఓ ముఖ్య ప్రజాప్రతినిధి చేసిన సిఫార్సు మేరకు దేవాదాయశాఖ అధికారులు రెండేళ్ల కిందట ప్రతిపాదనలు సిద్ధంచేసి పంపారు. దీన్ని ఉన్నతాధికారులు తిరస్కరించారు.

తాజాగా జీవో 211 ప్రకారం ఆ భూమికి సమాన విలువైన ప్రత్యామ్నాయ భూమిని ఆ ఆలయానికి ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో జమ్మలమడుగు ఆర్డీవో, వేంపల్లి తహసీల్దార్‌, దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ (ఏసీ), వేంపల్లి సబ్‌రిజిస్ట్రార్‌, ఆలయ ఈవోతో కలిపి కమిటీ వేశారు. ఈ కమిటీ అక్కడ ఎకరా విలువ రూ.3.30 లక్షలుగా పేర్కొని, మొత్తం 5.19 ఎకరాలకు రూ.16.92 లక్షలుగా విలువ కట్టారు. కత్తులూరు గ్రామంలోని 543 సర్వే నంబరులో 94.61 ఎకరాల కొండ పోరంబోకు భూమి ఉండగా, అందులో కొంత భూమిని గంగమ్మ ఆలయానికి ప్రత్యామ్నాయంగా ఇవ్వాలని నిర్ణయించారు. దీని విలువ ఎకరానికి రూ.1.32 లక్షలుగా పేర్కొని.. 13 ఎకరాలను గంగమ్మ ఆలయానికి ఇవ్వొచ్చని కమిటీ నివేదిక ఇచ్చింది.

రెండేళ్లలో తగ్గిన భూమి విలువ!:ఆక్రమణలో ఉన్న 5.19 ఎకరాలను వేలం ద్వారా విక్రయించాలని దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ రెండేళ్ల క్రితం ప్రతిపాదన పంపినప్పుడు.. సబ్‌ రిజిస్ట్రార్‌ద్వారా సేకరించిన వివరాల ప్రకారం ఎకరా రూ.18.39 లక్షలని, మార్కెట్‌ విలువ రూ.22 లక్షలపైనే ఉందని అందులో పేర్కొన్నారు. అంటే ఆ లెక్కన 5.19 ఎకరాలకు సబ్‌రిజిస్ట్రార్‌ ధర ప్రకారం రూ.95.44 లక్షలు, మార్కెట్‌ విలువ రూ.22 లక్షల ప్రకారం రూ.1.14 కోట్లు అవుతుంది. కానీ ప్రస్తుత అధికారుల కమిటీ రూ.16.92 లక్షలే అని పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం అక్కడ ఎకరా కోటి వరకు ధర ఉందని, అధికారులు కావాలనే చౌకగా చూపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ దస్త్రం ఇప్పటికే దేవాదాయశాఖ ఉన్నతాధికారులవద్దకు వచ్చినట్లు సమాచారం. దీని ఆమోదం కోసం రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. గతవారం కలెక్టర్‌ ఈ ఆలయానికి ప్రత్యామ్నాయ భూమి ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ అంశంపై దేవాదాయశాఖ ఇన్‌ఛార్జ్‌ ఉపకమిషనర్‌ (కర్నూలు) రాణాప్రతాప్‌ను వివరణ కోరగా.. అటువంటి ప్రతిపాదన ఏమీలేదని పేర్కొనడం కొసమెరుపు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details