ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

108 వాహనాలకు షెడ్లు లేవు - no shelters fro 108 vehicle in cadapa updates

ప్రాణాపాయ స్థితిలో.. ఆపదలో చిక్కుకున్న ఎవరు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చినా.. కుయ్‌కుయ్‌ మంటూ ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులు.. బాధితులను సకాలంలో ఆసుపత్రులకు చేర్చి ప్రాణాలు నిలిపే సంజీవినిగా పేరుపొందిన 108 వాహనాలు నిలిపేందుకు కాస్త నీడ కరవైంది. ప్రజల ప్రాణాల రక్షణే పరమార్థంగా పనిచేసే సిబ్బందికి కనీస వసతులు లేవు. ఉండేందుకు స్థిరమైన ఏర్పాట్లు లేవు. దీంతో ఎక్కడపడితే అక్కడ బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లగా సమస్యల నడుమ విధులు నిర్వహిస్తున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడని జిల్లాలోని 108 అంబులెన్సు వాహనాల సిబ్బంది వాపోతున్నారు.

no shelters
no shelters

By

Published : Aug 5, 2020, 1:20 PM IST

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని సకాలంలో ఆసుపత్రులకు తరలించి వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 108 వ్యవస్థను ఏర్పాటు చేసింది. జిల్లాలో ప్రస్తుతం 46 అంబులెన్సులు ఉన్నాయి. గతంలో మంజూరైన పాత వాహనాలు 26. వాటిలో 16 వాహనాలకు కాలం చెల్లడంతో పక్కన పెట్టేశారు. ఇటీవల ప్రభుత్వం కొత్తగా 36 వాహనాలను కేటాయించింది. 46లో పది వాహనాలను కరోనా రోగుల కోసం కేటాయించారు. కొన్ని మండలాలకు ఇంకా కొత్త వాహనాలు చేరుకోలేదు. ఒక్కో వాహనంలో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు టెక్నీషియన్లు చొప్పున సుమారు 184 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.

46 అంబులెన్సులకు గాను సుమారు 36 వాహనాల్లో పనిచేసే సిబ్బంది అవస్థ పడుతున్నారు. ప్రధానంగా వారు తలదాచుకునేందుకు సరైన భవనాలు లేవు. దీంతో జిల్లాలోని ఆయా మండల కేంద్రం పరిసరాల్లోని పీహెచ్‌సీ కేంద్రం, తహసీల్దారు కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి తదితర కార్యాలయాల్లో నిరుపయోగ గదుల్లో ఉంటున్నారు. అక్కడ కూర్చునేందుకు కుర్చీలు ఉండవు. గత్యంతరం లేక నేలపైనే కుర్చుంటున్నారు. కేసులు లేని సమయంలో రాత్రిపూట నేలపైనే దుప్పటి వేసుకుని నిద్రిస్తున్నారు. కనీస అవసరాలు తీర్చుకునేందుకు మరుగుదొడ్ల వసతి కూడా లేదు. సీసాల్లో మంచినీరు తీసుకెళితేనే దాహం తీరుతుంది. లేదంటే తాగునీటికీ తిప్పలు తప్పడం లేదని 108 సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పులివెందులలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణలోని పంచనామా గది సమీపంలోని ఒక గదిలో 108 వాహన సిబ్బంది ఉంటున్నారు. విద్యుత్తు సరఫరా కూడా సరిగా లేదు. దీంతో రాత్రిపూట భయం భయంగా ఉంటున్నారు. కొన్నేళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. ఇటీవల వారు ఎంపీ అవినాష్‌రెడ్డిని కలసి తమ సమస్యను విన్నవించారు.

తుప్పుపట్టే ఆస్కారం

జిల్లాలోని 108 వాహనాలను నిలపటానికి ఎలాంటి షెడ్డులు నిర్మించలేదు. ఫలితంగా ఎండలో, చెట్ల కింద నిలుపుతున్నారు. వాటికి రక్షణ లేకపోవడంతో ఎండకు ఎండి వానకు తడిసి రంగులు వెలసిపోతున్నాయి. వాహనాల పైభాగమంతా తుప్పు పట్టే ప్రమాదం ఉంది. దీనివల్ల వాటి మన్నిక కూడా త్వరగా దెబ్బతినే ఆస్కారముంది. ప్రజలకు ఉపయోగపడే 108 వాహనాల సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టాలని సిబ్బంది కోరుతున్నారు.

షెడ్ల నిర్మాణానికి చర్యలు

108 వాహనాల నిలుపుదలకు ప్రత్యేక షెడ్లను నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సిబ్బంది కూడా చాలాచోట్ల సౌకర్యాలున్న గదుల్లోనే ఉంటున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే పరిశీలించి వసతులు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటాం. - ఇక్బాల్‌, 108 అంబులెన్సుల జిల్లా మేనేజర్‌

ఇదీ చదవండి :వకుళమాత ఆలయం వద్ద బయటపడ్డ పురాతన శాసనం

ABOUT THE AUTHOR

...view details