Attack on secretariat staff: కడప నగరపాలక సంస్థ పరిధిలో ఇటీవల అక్రమ నిర్మాణాలపై కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ ప్రత్యేక దృష్టి సారించారు. రెండు నెలల నుంచి ఈ తంతు సాగుతోంది. రహదారుల విస్తరణ, కాల్వలపై అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు. అందులో భాగంగా కడప నగరంలోని ఉక్కాయపల్లిలో రోడ్డుకు ఆనుకుని అక్రమంగా నిర్మాణం చేపట్టిన ఇంటిని కూల్చేందుకు 27వ వార్డు సచివాలయ సిబ్బంది వెళ్లారు. టౌన్ ప్లానింగ్ కార్యదర్శి కిషోర్ కుమార్‌తో పాటు మరికొందరు సిబ్బంది ఇంటి ముందు అక్రమ నిర్మాణాన్ని జేసీబీతో కూల్చేందుకు యత్నించగా... అధికార పార్టీకి చెందిన ఇంటి యజమానులు సతీష్ కుమార్ రెడ్డి తదితరులు అడ్డుకున్నారు. సిబ్బందిని నానా దుర్భాషలాడటమే కాకుండా... ఇళ్లు ఎవరిది అనుకుంటున్నావ్... ఎక్కడి నుంచి వచ్చావు అని పరుషంగా మాట్లాడారు. అంతటితో ఆగకుండా తిట్ల దండకం మొదలు బెట్టి బూతులు తిట్టారు. కమిషనర్‌ను ఇక్కడికి పిలుచుకుని రా అంటూ సిబ్బందిపై శివాలెత్తారు. వారి తిట్లకు మౌనం వహించిన సిబ్బంది... అక్కడే ఉండిపోవడంతో సహించలేని ఇంటి యజమానులు, ఐదారు మంది కలిసి సచివాలయ కార్యదర్శి కిషోర్ కుమార్, మరో వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. కాళ్లు, చేతులతో తన్నారు. మెడను అదిమి పట్టి విచక్షణారహితంగా కొట్టారు. సిబ్బందిపై దాడి చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలు, మీడియాలో క్షణాల్లోనే ప్రసారం అయ్యాయి.
బాధితులైన నలుగురు సిబ్బంది అక్కడి నుంచి వచ్చేసి విషయాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించడంతో.. బాధిత సిబ్బంది కడప టూటౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. టౌన్ ప్లానింగ్ కార్యదర్శి కిషోర్ కుమార్ ఫిర్యాదు మేరకు.. నిందితులు క్రాంతికుమార్ రెడ్డి, సతీష్ కుమార్ రెడ్డి, రంజిత్ కుమార్ తోపాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. హత్యాయత్నం కింద నిందితులపై ఐపీసీ 307, 332, 323 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీటితోపాటు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద కూడా కేసులు పెట్టారు. ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ వెంటనే రంగంలోకి దిగారు. ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. వంద మందికి పైగానే వార్డు సచివాలయ సిబ్బంది కూడా అక్రమ నిర్మాణం చేపట్టిన ఇంటి వద్దకు చేరుకున్నారు. కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్, తహసీల్దార్ శివరామిరెడ్డి దగ్గరుండి ఇంటి ముందు గోడను జేసీబీతో కూల్చి వేయించారు. ఇంటికి మార్కింగ్ వేసిన ప్రదేశం వరకు కూల్చివేస్తామని చెప్పారు. ఇంటి గోడ కూలుస్తున్న సమయంలో కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉండటం విశేషం. కానీ ఇంటిగోడ వరకు మాత్రమే కూల్చి వేసి.. శుక్రవారం ఉదయానికి ఇళ్లు ఖాళీ చేయాలని.. లేదంటే మార్కింగ్ వేసిన ప్రాంతం వరకు ఇంటిని కూడా కూల్చి వేస్తామని కమిషనర్ హెచ్చరించారు. ఉద్యోగులపై ఎవరైనా ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
శుక్రవారం ఉదయంలోగా ఇల్లు ఖాళీ చేయకపోతే ఇంటిని కూల్చేస్తాం. సిబ్బందిపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే వదిలిపెట్టం -సూర్యసాయి ప్రవీణ్ చంద్, కమిషనర్